D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ అక్టోబర్ 13 (అక్షరం న్యూస్) అభివృద్ధి పట్ల దూరదృష్టి.. ప్రజా అవసరాలపై ప్రత్యేక దృష్టి.. హామీలను ఆచరణలోకి తీసుకురావడంలో కార్యదక్షత.. ప్రాంత ప్రగతికి నిధులు సమకూర్చడంలో రాజకీయ చొరవ.. ఇవే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ ప్రస్థానంలో ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి! పదవులు మారినా.. శాఖలు మారినా.. ఖమ్మం జిల్లా అభివృద్ధే లక్ష్యంగా ఆయన అడుగులు సాగుతున్నాయి. ప్రభుత్వ యంత్రాంగానికి అవసరమైన మౌలిక వసతుల కల్పన నుంచి ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావడం వరకు ప్రతి అంశాన్నీ అభివృద్ధి దృక్పథంతో పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగా ఖమ్మం, సత్తుపల్లిలో ఆర్‌అండ్‌బీ అతిథి గృహాల నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించగా, వాటి ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు కల్లూరులోనూ ఆధునిక వసతులతో నూతన అతిథి గృహం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఒకప్పుడు ప్రతిపాదనలకే పరిమితమైన పనులను ముందుకు తీసుకెళ్లడం.. మారుతున్న అవసరాలకు అనుగుణంగా కొత్త సదుపాయాలను కల్పించడం.. జిల్లా అభివృద్ధిలో తనదైన ముద్ర వేయడం ద్వారా తుమ్మల తన రాజకీయ అనుభవాన్ని ఆచరణలో చూపిస్తున్నారు. ఖమ్మం నుంచి సత్తుపల్లి వరకు.. అక్కడి నుంచి కల్లూరు దాకా సాగుతున్న ఈ ప్రయత్నాలు జిల్లా మౌలిక వసతుల బలోపేతానికి మరో ముందడుగుగా నిలుస్తున్నాయి. అభివృద్ధి పనులకు ప్రణాళికలు రూపొందించడం, వాటిని కార్యరూపంలోకి తీసుకురావడంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ వసతి సౌకర్యాలను మెరుగుపరిచే లక్ష్యంతో ఆర్‌అండ్‌బీ అతిథి గృహాల నిర్మాణంపై దృష్టి సారించారు. ఖమ్మం, సత్తుపల్లిలో నూతన అతిథి గృహాల నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించగా, ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు కల్లూరులోనూ ఆధునిక హంగులతో ఆర్‌అండ్‌బీ అతిథి గృహం నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో మూడు ప్రాంతాల్లో ప్రభుత్వ వసతి సదుపాయాల విస్తరణకు మార్గం సుగమమవుతోంది. జిల్లా కేంద్రంతో పాటు సత్తుపల్లి, కల్లూరు ప్రాంతాలకు వివిధ శాఖల ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పర్యటనలకు వస్తుంటారు. వారికి మెరుగైన వసతి కల్పించడంతో పాటు అధికారిక సమావేశాలు, ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణకు అనుకూలమైన సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ నిర్మాణాలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా పాత భవనాల స్థానంలో ఆధునిక సౌకర్యాలతో కొత్త భవనాలు నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. ఖమ్మంలో రూ.7.70 కోట్లతో ఆరు సూట్లు... ఖమ్మం నగరంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహం సుమారు 50 ఏళ్ల క్రితం నిర్మించినది. దశాబ్దాలుగా ఎందరో ప్రముఖులకు ఆతిథ్యమిచ్చిన ఈ భవనం ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. గోడలకు పగుళ్లు, పైకప్పుల నుంచి నీటి లీకేజీలు, కాంక్రీటు పెచ్చులు ఊడిపడటం, గదుల్లో తేమ చేరడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. తలుపులు, కిటికీలు దెబ్బతినడంతో పాటు తరచూ మరమ్మతులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో పాత భవనాన్ని తొలగించి, అదే స్థలంలో ఆరు సూట్లతో నూతన అతిథి గృహాన్ని నిర్మించాలని నిర్ణయించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలతో అధికారులు రూ.7.70 కోట్లతో అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. 2026 జనవరి 2న రూపొందించిన అంచనాలను ఖమ్మం ఆర్‌అండ్‌బీ సర్కిల్ పర్యవేక్షక ఇంజినీర్ ఎం. యాకోబ్ భవనాల విభాగం చీఫ్ ఇంజినీర్‌కు సమర్పించారు. అనంతరం జనవరి 13న చీఫ్ ఇంజినీర్ జి. రాజేశ్వర్‌రెడ్డి పరిపాలన అనుమతుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతం ఈ నిర్మాణానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే పెరిగిన నిర్మాణ వ్యయాలు, ఆధునిక సౌకర్యాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టు వ్యయాన్ని రూ.10 కోట్లకు పెంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రక్రియలు పూర్తయిన అనంతరం నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. సత్తుపల్లిలో రూ.3.50 కోట్లతో నాలుగు సూట్లు... సత్తుపల్లిలో నాలుగు సూట్లతో ఆధునిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహాన్ని నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలు 2016లోనే ప్రారంభమయ్యాయి. తొలుత రూ.1.50 కోట్లతో నిర్మాణానికి అనుమతులు లభించగా, అనంతరం సవరించిన అంచనాల ప్రకారం రూ.3 కోట్లకు అనుమతులు మంజూరయ్యాయి. కాలక్రమంలో నిర్మాణ వ్యయాలు పెరగడంతో ప్రస్తుత అంచనాల ప్రకారం రూ.3.50 కోట్లతో టెండర్లు ఆహ్వానించారు. తాజాగా నిర్మాణ వ్యయాన్ని రూ.5 కోట్లకు పెంచి, సవరించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపడం జరిగింది. ఈ పెంపునకు సంబంధించి ప్రభుత్వ ఆమోదం ఇంకా రావాల్సి ఉంది. ఆమోదం లభించిన అనంతరం సవరించిన అంచనాలకు అనుగుణంగా తదుపరి చర్యలు చేపట్టనున్నారు. దశాబ్దకాలంగా వివిధ దశల్లో కొనసాగుతున్న ఈ ప్రాజెక్టును కార్యరూపంలోకి తీసుకురావడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. కల్లూరులోనూ ఆధునిక భవనానికి ప్రతిపాదనలు... ఖమ్మం, సత్తుపల్లితో పాటు కల్లూరులోనూ ప్రభుత్వ వసతి సదుపాయాలను మెరుగుపరచాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిర్ణయించారు. కల్లూరులో ఆర్‌అండ్‌బీ అతిథి గృహ నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు అధికారులు ఆధునిక హంగులతో భవన నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయి, అవసరమైన అనుమతులు లభిస్తే కల్లూరులోనూ మరో ఆధునిక ప్రభుత్వ వసతి భవనం అందుబాటులోకి రానుంది. పదవి ఏదైనా.. అభివృద్ధే లక్ష్యం!.. రోడ్లు, భవనాలు సహా మౌలిక సదుపాయాల కల్పనలో ప్రాంతీయ అవసరాలకు ప్రాధాన్యమిస్తూ మంత్రి తుమ్మల ముందుకు సాగుతున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభమైన సత్తుపల్లి తనిఖీ బంగళా ప్రతిపాదనకు ఇప్పుడు కార్యరూపం లభించే దిశగా అడుగులు పడుతుండటం, ఖమ్మం నగరంలోని పాత అతిథి గృహం స్థానంలో కొత్త భవన నిర్మాణానికి చర్యలు చేపట్టడం, కల్లూరులోనూ కొత్త నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయించడం ఈ ప్రయత్నాల్లో భాగంగా కనిపిస్తున్నాయి. ఈ మూడు ప్రాంతాల్లో ప్రణాళికలు పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చితే ప్రభుత్వ అధికారుల పర్యటనలు, ప్రజాప్రతినిధుల సందర్శనలు, అధికారిక సమావేశాలకు మెరుగైన వసతి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ మౌలిక సదుపాయాల బలోపేతానికి ఈ నిర్మాణాలు దోహదపడనున్నాయి.
.
Aksharam Telugu Daily