D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/తల్లాడ అక్టోబర్ 28 (అక్షరం న్యూస్) న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో మొత్తం 35 కేసులకు సంబంధించిన 982.562 కిలోల గంజాయి, హషీష్ ఆయిల్‌ను తల్లాడ మండలం గోపాలపేట గ్రామంలోని ఎం/ఎస్ ఏడబ్ల్యూఎం కన్సల్టింగ్ లిమిటెడ్ ప్రాంగణంలో 27.10.2026న పూర్తిగా నిర్వీర్యం చేసినట్లు జిల్లా ఎస్పీ, డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ రోహిత్ రాజు ఐపీఎస్ తెలిపారు. నిర్వీర్యం చేసిన మాదకద్రవ్యాల్లో 977 కిలోల 816 గ్రాముల గంజాయి, 4 కిలోల 746 గ్రాముల హషీష్ ఆయిల్ ఉన్నాయని, వీటి మొత్తం విలువ సుమారు రూ.4 కోట్ల 91 లక్షలు ఉంటుందని వెల్లడించారు.నిర్వీర్య ప్రక్రియలో పర్యావరణానికి, ప్రజారోగ్యానికి ఎలాంటి హాని కలగకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, మాదకద్రవ్యాల నిర్మూలన ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేయడమే కాకుండా వారి కుటుంబాల ఆశలను కూడా దెబ్బతీస్తుందని అన్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగాన్ని ప్రోత్సహించే చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతూ గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారని తెలిపారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, క్రయవిక్రయాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ సభ్యులు, సిఐ కరుణాకర్, ఆర్ఐ నరసింహారావు, ఎస్ఐ హారిక, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily