AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం/ భద్రాచలం : *.... భద్రాద్రి కొత్తగూడెం /కొత్తగూడెం / మే 10 / అక్షరం న్యూస్ -: కేంద్ర హోం శాఖ సహాయమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న బండి సంజయ్ తన కుమారుడిపై నమోదైన లైంగిక వేధింపుల కేసులో బాధిత కుటుంబ సభ్యులను బెదిరించారనే ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని బండి సంజయ్‌ను కేంద్ర మంత్రి పదవి నుండి వెంటనే తొలగించాలని జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈసందర్భంగా కామేష్ మాట్లాడుతూ మహిళల భద్రత, గౌరవం, న్యాయం వంటి అంశాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న తరుణంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రికి సంబంధించిన కుటుంబ సభ్యుడిపై ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు రావడం అత్యంత విచారకరమన్నారు. బాధిత కుటుంబ సభ్యులను బెదిరించారనే వార్తలు ప్రజాస్వామ్య వ్యవస్థకు, న్యాయపరమైన ప్రక్రియలకు విఘాతం కలిగించే అంశమని పేర్కొన్నారు. ఇలాంటి సున్నితమైన కేసుల్లో రాజకీయ హోదాలు, అధికార ప్రభావం, వ్యక్తిగత పరిచయాలు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసి నిష్పాక్షికంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బాధితులకు పూర్తి రక్షణ కల్పించడంతో పాటు, కేసులో ఎవరైనా దోషులుగా తేలితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చట్టం ముందు అందరూ సమానులనే రాజ్యాంగ సూత్రాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని, అధికారంలో ఉన్నవారికి వేరు, సామాన్య ప్రజలకు వేరు అనే విధానం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఆయన అన్నారు. మహిళలపై జరుగుతున్న నేరాల విషయంలో రాజకీయ ప్రభావాలకు తావులేకుండా న్యాయం జరిగేలా ప్రభుత్వం వ్యవహరించాలని సూచించారు. దేశ ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన పదవుల్లో ఉన్నవారు తమపై లేదా తమ కుటుంబ సభ్యులపై వచ్చిన ఆరోపణల విషయంలో పారదర్శకత, బాధ్యతాయుత వైఖరి ప్రదర్శించాలని అన్నారు. ఈకేసులో పూర్తి స్థాయి దర్యాప్తు జరిగి నిజాలు వెలుగులోకి రావాలని, బాధితులకు న్యాయం జరిగే వరకు జేబీపీ తరఫున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
.
Aksharam Telugu Daily