AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి జిల్లా/ సుల్తానాబాద్ : పెద్దపల్లి జిల్లా / సుల్తానాబాద్ / ఆగష్టు 18 / అక్షరం న్యూస్. సుల్తానాబాద్: ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ. 24.18 కోట్ల విలువైన కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని పక్కదారి పట్టించిన కేసులో ఇద్దరు రైస్ మిల్లర్లను సుల్తానాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పౌర సరఫరాల శాఖ పెద్దపల్లి జిల్లా మేనేజర్ ముప్పిడి శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు చేపట్టారు.సుగ్లాంపల్లిలోని లక్ష్మి ఇండస్ట్రీస్' రైస్ మిల్లుకు 2023-24 సీజన్‌లో 10,015.636 మెట్రిక్ టన్నుల ప్రభుత్వ ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ కోసం కేటాయించారు. అయితే, మిల్లర్లు కేవలం 1,577.289 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మాత్రమే ప్రభుత్వానికి అందించారు. మిగిలిన 5,020.719 మెట్రిక్ టన్నుల బియ్యం సుమారు 7,493.610 మెట్రిక్ టన్నుల ధాన్యం బకాయి పడ్డారు.ఈ నెల 6న సివిల్ సప్లైస్ అధికారులు నిర్వహించిన భౌతిక తనిఖీల్లో మిల్లులో నిల్వలు ఏమీ లేకపోవడంతో, రూ. 24,18,59,070 విలువైన ధాన్యాలు దుర్వినియోగమైనట్లు ప్రాథమికంగా ధ్రువీకరించారు. దీనితో మిల్లు మేనేజింగ్ పార్టనర్ రేణికుంట మధు, పార్టనర్ రేణికుంట రవీందర్ రెడ్డి లను పోలీసులు అరెస్ట్ చేసి నిందితులపై భారతీయ న్యాయ సంహిత , 2023 లోని సెక్షన్స్ 316(2), 316(5), 318(3) r/w 3(5), నిత్యావసర వస్తువుల చట్టం 1955లోని సెక్షన్ 7 మరియు తెలంగాణ రైస్ కస్టమ్ మిల్లింగ్)ఆర్డర్ 2015లోని సెక్షన్ 7 కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు డిసిపి సోమవారం రోజు సుల్తానాబాద్ పోలీసు స్టేషన్ లో జరిగిన పాత్రికేయుల సమావేశం లో తెలిపారు.
.
Aksharam Telugu Daily