AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట జిల్లా : సూర్యాపేట జిల్లా అక్షరం ప్రతినిధి తుంగతుర్తి మండలం అర్వపల్లి గ్రామ శివారులోని 365బి హైవేపై శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక ఉపాధ్యాయురాలు మృతి చెందగా, మరో ముగ్గురు ఉపాధ్యాయులు తీవ్రంగా క్షతగాత్రులయ్యారు. నల్గొండలో నివాసం ఉంటూ తుంగతుర్తి మండలంలోని వివిధ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న నలుగురు ఉపాధ్యాయులు ప్రతిరోజూ కారులో పాఠశాలకు రాకపోకలు సాగిస్తున్నారు. సంక్రాంతి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో స్కూల్‌కు వెళ్తున్న సమయంలో కారు అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న గుంతలో పడిపోయింది. ఈ ప్రమాదంలో తుంగతుర్తి కస్తూర్బా విద్యాలయ ప్రత్యేక అధికారి కల్పన తీవ్ర గాయాలతో ఘటన స్థలంలోనే మృతి చెందారు. అదే ప్రమాదంలో తుంగతుర్తి మండలం రావులపల్లి జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయురాలు పోరెడ్డి గీత, అన్నారం జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయుడు అలవాల ప్రవీణ్ కుమార్, తుంగతుర్తి జడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయురాలు సునీత తీవ్రంగా గాయపడి క్షతగాత్రులయ్యారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటన విషయం తెలుసుకున్న అర్వపల్లి ఎస్‌ఐ సైదులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
.
Aksharam Telugu Daily