AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ జూన్ 07 అక్షరం న్యూస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను,విద్యార్థులను పూర్తిగా నిరాశపరిచిందని, ప్రజావ్యతిరేక విధానాల వల్ల ప్రజల్లో ఈ పాలనపై తీవ్ర వ్యతిరేకత పెరిగిందని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ వంద సీట్లకు పైగా గెలిచి మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పోవాలి. కేసీఆర్ రావాలి అనే నినాదం మార్మోగుతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని రంగంపల్లిలో గల తిరుమల గార్డెన్‌లో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్దపల్లి నియోజకవర్గస్థాయి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ మంత్రి, కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్, హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డిలతో కలిసి హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతు బంధు, రైతు బీమా వంటి కీలక సంక్షేమ పథకాలు పూర్తిగా నిలిచిపోయాయని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ ఈ ప్రభుత్వం అటకెక్కించిందని, ఫీజ్ రీఇంబర్స్‌మెంట్ ఆపేసి 30 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేశారని మండిపడ్డారు. కరోనా కష్టకాలంలోనూ కేసీఆర్ రైతుబంధు నిధులు ఆపకుండా 11 విడతల్లో రూ.73వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తే,రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత యాసంగి పంటకు రైతుబంధును పూర్తిగా ఎగ్గొట్టారని విమర్శించారు. ఎన్నికల సమయంలో దేవుళ్లపై ఒట్లు వేసి చెప్పిన రూ.2 లక్షల రుణమాఫీ సగం మందికి కూడా కాలేదని, రుణమాఫీ కోసం రూ.35 వేల కోట్లు అవసరమని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం,బడ్జెట్‌లో కేవలం రూ. 20 వేల కోట్లు మాత్రమే కేటాయించి రైతులను దగా చేసిందని ధ్వజమెత్తారు.ఎల్‌ఐసీకి ప్రీమియం కట్టకపోవడం వల్ల గత నాలుగు నెలలుగా రైతు బీమా పథకాన్ని నిర్వీర్యం చేశారని,చనిపోయిన 3వేల మంది రైతుల కుటుంబాలకు ఐదు లక్షల సాయం అందకుండా ఆగం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రహస్యంగా తీసుకువచ్చిన జీవో నెంబర్ 8 ద్వారా రైతు డిస్కాం ఏర్పాటు చేసి,కేసీఆర్ ఇచ్చిన 24 గంటల ఉచిత విద్యుత్‌కు రేవంత్ రెడ్డి ఉరివేయబోతున్నారని హరీష్ రావు హెచ్చరించారు. విధానం అమల్లోకి వస్తే వ్యవసాయానికి కేవలం పగటిపూట 7 నుండి 8 గంటలు మాత్రమే సోలార్ విద్యుత్ వస్తుందని, రాత్రి వేళల్లో కరెంట్ ఉండదని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి తాను రైతు బిడ్డనని చెప్పుకుంటూనే ఉన్న కరెంట్ ఊడగొడుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రతి మండలానికి గోడౌన్లు కట్టించి ఎప్పుడూ ఎరువుల కొరత రాకుండా చూశామని, కానీ ప్రస్తుతం ప్రభుత్వం ఎరువుల సరఫరాలో విఫలమవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఎరువుల కోసం లైన్లలో నిలబడి లాఠీచార్జీలు తినే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో రైతులు పండించిన వడ్లు,మక్కజొన్నను కొనుగోలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని,45 రోజుల పాటు కళ్లాల్లోనే ధాన్యాలు పేరుకుపోయినా స్పందించడం లేదని దుయ్యబట్టారు. చాలా చోట్ల సంచులు దొరకక రైతులు స్వయంగా బస్తాలు కొనుగోలు చేసి పంటను నిల్వ చేసుకోవాల్సిన దుస్థితి వచ్చిందని,కేసీఆర్ హయాంలో భూముల విలువ పెరిగితే,కాంగ్రెస్ వచ్చాక రైతు గౌరవంతో పాటు భూమి విలువ కూడా పడిపోయిందని ఆరోపించారు. హైదరాబాద్‌లో హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూలగొడుతూ రేవంత్ రెడ్డి నయా హిట్లర్ లా వ్యవహరిస్తున్నారని హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్వయంగా రేవంత్ రెడ్డే తనకు హిట్లర్ అంటే ఇష్టమని,హిట్లర్‌ను చూసే హైడ్రా తెచ్చానని చెప్పుకోవడం ఆయన అహంకారానికి, నెత్తికెక్కిన అధికారం మత్తుకు నిదర్శనమన్నారు. నాడు పేదల బతుకులను ఊచకోత కోసిన హిట్లర్‌కు పట్టిన గతే ఈ నయా హిట్లర్ రేవంత్ రెడ్డికి పడుతుందని,తెలంగాణ ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు.రేవంత్ రెడ్డి చేసే అవినీతి, అరాచకాలకు భవిష్యత్తులో ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు కూడా ప్రజలకు తలదించుకుని క్షమాపణలు చెప్పుకోవాల్సి వస్తుందని అన్నారు.ఒకపక్క ఇచ్చే పథకాలు ఎగ్గొడుతూనే, మరోపక్క భూముల రిజిస్ట్రేషన్ ఫీజులు,మోటార్ సైకిల్ టాక్స్,మద్యం ధరలు,ఆర్టీఏ టాక్స్‌లు పెంచి ప్రజలపై విపరీతమైన భారం మోపారని విమర్శించారు. రేవంత్ రెడ్డి తల కిందికి పెట్టి కాళ్ళు మీదికి పెట్టినా మళ్లీ గెలిచేది లేదని,రానున్న రోజుల్లో కాంగ్రెస్‌కు ప్రజలే సరైన రీతిలో బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. ఈ విస్తృత స్థాయి సమావేశంలో నియోజకవర్గ ఇన్చార్జ్ చిరుమల రాకేష్ కుమార్,బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఈద శంకర్ రెడ్డి, సి.సత్యనారాయణ రెడ్డి, రఘువీర్ సింగ్,గంట రాములు యాదవ్, మమతా రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్,కటారి రేవతి రావు,బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్ కుమార్ తోపాటు పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలోని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, గులాబీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily