AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా /ములకలపల్లి /అక్టోబర్ 3 /అక్షరం న్యూస్: అధికార యంత్రాంగం అలసత్వం, ప్రణాళికా లోపం వెరసి ఓ నిండు ప్రాణాన్ని గాల్లో కలిపేశాయి. ప్రధాన రహదారిపై బ్రిడ్జి కూలిపోతే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకుండా, భారీ వాహనాలను గ్రామం గుండా సింగిల్ రోడ్డుపైకి మళ్లించి చేతులు దులుపుకున్న అధికారుల తీరు ఫలితంగా ములకలపల్లి మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టిప్పర్ లారీ రూపంలో వచ్చిన మృత్యువుకు ఓ వ్యక్తి బలయ్యాడు. ఘటన వివరాల్లోకి వెళితే... స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... కాటారపు సాయిబాబు (55) అనే వ్యక్తి సెంటర్‌లో తన పనులు ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ స్కూటీని ఆపి ఎక్కేందుకు ప్రయత్నించాడు. అయితే దురదృష్టవశాత్తు అతడు ఒక్కసారిగా కాలు జారి కింద పడిపోయాడు. సరిగ్గా అదే క్షణంలో పాల్వంచ నుంచి దమ్మపేట వైపుగా తాళ్లపాయి రోడ్డు మార్గంలో వస్తున్న ఓ టిప్పర్ లారీ సాయిబాబు మీదికి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన అతన్ని స్థానికులు వెంటనే అంబులెన్స్‌లో పాల్వంచ ఆస్పత్రికి తరలించినప్పటికీ, మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు తెలిసింది. మృతుడికి ఇద్దరు కుమారులు ఉండగా, వారు బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్నారు. భార్య సైతం కుమారుల వద్దే ఉంటుండటంతో సాయిబాబు స్వగ్రామంలో ఒంటరిగా నివసిస్తున్నాడు. అధికారుల నిర్లక్ష్యమే కారణమా..? తీవ్ర వాహన రద్దీ ఉండే ప్రధాన రహదారిపై రాజుపేట చివర గల బ్రిడ్జి కూలిపోవడంతో, లారీలు, బస్సులను ఈ మార్గంలోకి మళ్లించాల్సి వచ్చింది. నిబంధనల ప్రకారం ప్రత్యామ్నాయంగా సరైన సైడ్ రోడ్డును ఏర్పాటు చేయాల్సిన అధికార యంత్రాంగం, ఆ బాధ్యతను పూర్తిగా గాలికొదిలేసింది. ఊరి గుండా కంపగూడెం క్రాస్ రోడ్డు వైపు ట్రాఫిక్‌ను దారి మళ్లించి మిన్నకుండిపోయారు. ఇది చిన్న సింగిల్ రోడ్డు కావడం, దానికితోడు ఆర్టీసీ బస్సులు, ట్రాక్టర్లు, భారీ టిప్పర్లు, లారీలు అన్నీ ఈ మార్గంలోనే పోటెత్తడంతో ఆ ప్రాంతమంతా తీవ్ర రద్దీ నెలకొంది. తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్లే ఇప్పుడు అమాయకుడి ప్రాణం పోయిందని గ్రామస్తులు భగ్గుమంటున్నారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి ప్రత్యామ్నాయ రహదారిని సిద్ధం చేయడంతో పాటు, భారీ వాహనాల రాకపోకలను నియంత్రించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
.
Aksharam Telugu Daily