AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ మే20 అక్షరం న్యూస్ పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో జరిగిన బోనాల జాతర వివాదంపై బహుజన సమాజ్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షులు ఇరికిల రాజనర్సయ్య, పార్లమెంట్ ఇంచార్జ్ కాదాసి రవీందర్ మాట్లాడుతూ పెగడపల్లి గ్రామంలో ఎల్లమ్మ తల్లి బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకునే క్రమంలో, బహుజన వర్గాల వారు బోనాలు తీయడాన్ని కొందరు అడ్డుకోవడం సరైనది కాదన్నారు.గతంలో బీసీ ,ఎస్సీ ,ఎస్టీ వర్గాలన్నీ ఒకే వర్గంగా కలిసికట్టుగా పండుగలు, ఉత్సవాలు జరుపుకునేవారని వారు గుర్తు చేశారు. కానీ నేడు కంప్యూటర్ యుగంలో జీవిస్తున్నప్పటికీ,మనుషుల్లో కుల,మత బేధాలు రావడానికి అగ్రవర్ణ ధోరణులు,పెట్టుబడిదారీ రాజకీయ వ్యవస్థలు, మనువాద పార్టీలే కారణమని మండిపడ్డారు. సమాజంలో ఇలాంటి వ్యత్యాసాలను పెంచి పోషిస్తూ, విచక్షణ కోల్పోయి అలజడులు సృష్టించడం కొందరి అవివేకానికి నిదర్శనమని వారు స్పష్టం చేశారు. ఇప్పటికైనా పట్టణాల్లో, గ్రామాల్లో ఉండే బీసీ, ఎస్సీ, ఎస్టీ బహుజన బిడ్డలంతా ఒకే వర్గంగా కలిసికట్టుగా పండుగలు జరుపుకోవాలని, అలాగే అంతా ఒక్కటై రాజ్యాధికారం సాధించుకోవాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి వివక్షాపూరిత సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వ అధికారులు,రాజకీయ నాయకులు తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు నర్ల గోపాల్ యాదవ్,కార్యవర్గ సభ్యులు బొంకురి రమేష్, రామగుండం ఇంచార్జ్ జింక ఉదయ్, పెద్దపల్లి నియోజకవర్గ అధ్యక్షులు బొంకూరి దుర్గయ్య, పట్టణ అధ్యక్షురాలు రామిల్ల శారద తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily