D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT. Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : * మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ ఏప్రిల్ 21(అక్షరం న్యూస్ )మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం లోని కోమట్లగూడెం (గామంలో ప్రతి పేదవాడి ఇంటి కలను సాకారం చేసే దిశగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టింది సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకునే వారికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం ప్రతీ గ్రామంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కానీ ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో కమిటీ సభ్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అనర్హులను ఎంపిక చేసి ఆ పేర్లనే ఫైనల్ చేయాలని అధికారుల పై ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది. అనర్హుల పేర్లను ఫైనల్ ఎలా చేస్తారని కొందరు అధికారులను నిలదీస్తే తమ చేతిలో ఏం లేదని, అంతా ఇందిరమ్మ కమిటీ చేతిలోనే ఉందనే సమాధానం చెప్పడం గమనార్హం. అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు.. ములుగు నియోజకవర్గ స్థాయిలోని గంగారం కొత్తగూడ మండలంలో అర్హులుగా ప్రకటించిన వారిలో ప్రభుత్వ కార్యాలయాలో పనిచేసేవారు, భూ స్వాములు, విదేశాల్లో ఉన్నవారు, సొంత ఇల్లు ఉన్నవారు, ఇంతకు ముందు ప్రభుత్వ లబ్ధిపొందిన వారి పేర్లే ఎక్కువగా ఉన్నాయి. అనర్హులకే ఇండ్లు కేటాయించడం పై ఆయా గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు. అనర్హులకు ఇల్లు మంజూరు చేసి గ్రామస్థాయి నేతలు, అధికారులు లంచాలు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నకిలీపత్రాలు సృష్టించి బిల్లు విడుదల చేయడానికి స్థానిక నేతలు, కమిటీ సభ్యులు రూ.5 వేల నుంచి రూ.15 వేల వరకు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. స్లాబ్ ఇల్లు ఉన్నవారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారని, పెంకుటిల్లు ఉన్నా మంజూరు చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి. గ్రామ కార్యదర్శిని, ఎంపీడీఓను నిలదీస్తే అంతా ఇందిరమ్మ కమిటీ చేతిలోనే ఉందనే సమాధానం ఇస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం.. అనర్హులకు ఇండ్లు కేటాయించారని కొందరు గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేస్తే కలెక్టర్ హౌసింగ్ పీడీకి రాశారు. రెండువారాల తర్వాత పీడీని ఆరాతీయగా ఎంపీడీఓ చేతిలోనే ఉందని పేర్కొనడం గమనార్హం. అనర్హులకు ఇండ్లు కేటాయించిన అధికారులను సస్పెండ్ చేయాలని, సరైన విచారణ చేపట్టి అర్హులకు కేటాయించాలని మండల ప్రజలు కోరుతున్నారు. తుఫాన్ బాధితులకు మొండి చేయి... మండలంలో మోంథా తుఫాన్ కారణంగా పలు గ్రామాల్లో ఇళ్లు కూలిపోవడంతో అనేక కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. ప్రభుత్వం తరఫున తక్షణ సహాయంగా రూ.15 వేల చొప్పున అందించి, అనంతరం ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద గృహాలు మంజూరు చేస్తామని కలెక్టర్ ప్రకటించారు. మొదటి విడతలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజంగా ఇళ్లు కోల్పోయిన బాధితులను పక్కన పెట్టి నచ్చిన వారికి ఇళ్లను కేటాయిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
.
Aksharam Telugu Daily