D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/వైరా అక్టోబర్ 30 (అక్షరం న్యూస్) వైరా వ్యవసాయ మార్కెట్ యార్డుకు పెసర పంటను మద్దతు ధరకు విక్రయించేందుకు వస్తున్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి మార్కెట్‌కు వచ్చిన పెసలను వెంటనే కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ జిల్లా నాయకులు కట్టా కృష్ణార్జునరావు, వనమా విశ్వేశ్వరరావు, బాణాల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. శుక్రవారం వైరాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. పెసర పంట కొనుగోలు కేంద్రం ప్రారంభించి నెల రోజులు గడుస్తున్నప్పటికీ నేటికీ కొనుగోళ్లు, కాంటాలు సక్రమంగా నిర్వహించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.మార్కెట్ యార్డుకు తీసుకొచ్చిన పెసలకు కోతుల బెడదతో పాటు కనీస సౌకర్యాలు లేకపోవడంతో అన్నదాతలు అవస్థలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఎంతో కష్టపడి పండించిన పంటను కాపాడుకోవడానికి రైతులు రాత్రింబవళ్లు మార్కెట్ యార్డులోనే పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొందన్నారు. నాణ్యత పేరుతో కొర్రీలు పెడుతూ కొనుగోళ్లను ఆలస్యం చేయడం సరికాదని, రైతులకు ఇబ్బందులు కలగకుండా వెంటనే కొనుగోళ్లు చేపట్టాలని అధికారులను డిమాండ్ చేశారు. రైతుల శ్రమను, ఆవేదనను అధికారులు గుర్తించి తక్షణమే సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ దొంతబోయిన వెంకటేశ్వరరావు, భూమాత కృష్ణమూర్తి, మద్దెల రవి, సక్కుబాయి, మిట్టపల్లి సత్యంబాబు, ఏదునూరి శ్రీను , గుజ్జర్లపూడి దేవరాజు, మిట్టపల్లి కిరణ్, విలాసాగరం నరేష్, సింగవరపు నరేష్, పటాన్ సైద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily