D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాప్ రిపోర్టర్ నవంబర్ 5 (అక్షరం న్యూస్) సత్తుపల్లి: బేతుపల్లి చెరువులో వరద ఉద్ధృతికి పడవ బోల్తాపడి గల్లంతైన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిలో పది మందిని సహాయక బృందాలు సురక్షితంగా ఒడ్డుకు చేర్చాయి. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహాయక చర్యల్లో పాల్గొన్న సిబ్బందిని అభినందించారు. గల్లంతైన మరో సిబ్బంది ఆచూకీ కూడా లభ్యమైన నేపథ్యంలో అతడిని సైతం వీలైనంత త్వరగా సురక్షితంగా ఒడ్డుకు చేర్చాలని అధికారులను ఆదేశించారు. బుధవారం బేతుపల్లి చెరువులో ఈ ప్రమాద ఘటన చోటుచేసుకోగా.. విషయం తెలిసిన వెంటనే మంత్రి పొంగులేటి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడి సహాయక చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. యుద్ధప్రాతిపదికన రెస్క్యూ ఆపరేషన్ చేపట్టేలా అధికారులను అప్రమత్తం చేశారు. అర్ధరాత్రి దాటేవరకు సహాయక చర్యల పురోగతిని నిరంతరం పర్యవేక్షించారు. హైదరాబాద్ నుంచి హుటాహుటిన బయలుదేరిన మంత్రి పొంగులేటి కల్లూరు మండలం నారాయణపురం చేరుకున్నారు. అక్కడి నుంచి మరికాసేపట్లో బేతుపల్లి చెరువు వద్దకు చేరుకుని సహాయక చర్యలను, క్షేత్రస్థాయి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు.
.
Aksharam Telugu Daily