OMKARI SRINIVAS, JAGITYAL. Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / జగిత్యాల : - జగిత్యాల /మెట్‌పల్లి/ఫిబ్రవరి 3/ అక్షరం న్యూస్ : పట్టణ కాంగ్రెస్ పార్టీలో పార్టీ కోసం నిబద్ధతతో కష్టపడ్డ కార్యకర్తలకు సరైన గుర్తింపు లభించడం లేదని, పార్టీకి ఎలాంటి సేవ చేయని వ్యక్తులకు టికెట్లు ఇవ్వడం ద్వారా ఇది మరోసారి నిరూపితమైందని పట్టణ మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ ఖుతుబోద్దీన్ పాషా ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం మెట్‌పల్లిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తాను గత ముప్పై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తున్నానని తెలిపారు. రాబోయే పట్టణ మున్సిపల్ ఎన్నికల్లో 9వ వార్డు నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించగా, పార్టీకి సంబంధం లేని వ్యక్తికి టికెట్ కేటాయించడం తీవ్ర అన్యాయమని అన్నారు. పార్టీ కార్యకర్తగా, పట్టణ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ ఉనికిని కాపాడేందుకు తాను చేసిన సేవలను ఆయన గుర్తు చేశారు. గత పది సంవత్సరాల బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రతిపక్ష హోదాలో ఉండి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ధర్నాలు, రాస్తారోకోలు, దీక్షలు నిర్వహించానని తెలిపారు. ఈ క్రమంలో పలుమార్లు అర్ధరాత్రి అరెస్టులు ఎదుర్కొని, పోలీస్ స్టేషన్లలో నిర్బంధించబడ్డానని, పార్టీ కోసం కేసులు కూడా నమోదయ్యాయని పేర్కొన్నారు. తన స్థానంలో బీ–ఫాం పొందిన వ్యక్తి గతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపై రెబల్‌గా పోటీ చేయడమే కాకుండా, ఇతర పార్టీల అభ్యర్థులకు మద్దతు ఇచ్చిన వ్యక్తి అని ఆయన ఆరోపించారు. అలాంటి వ్యక్తికి టికెట్ ఇవ్వడం పార్టీ కష్టపడ్డ కార్యకర్తలను అవమానించడమేనని అన్నారు. పార్టీ తన సేవలను గుర్తించకపోయినా, తాను కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేసిన పాషా, ఈ ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
.
Aksharam Telugu Daily