AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/ములకలపల్లి /సెప్టెంబర్ 18 /అక్షరం న్యూస్: అక్షరాలు దిద్దించాల్సిన సరస్వతీ నిలయం రాత్రి కాగానే ఆకతాయిల అడ్డాగా మారుతోంది. మద్యం, మత్తు పదార్థాల మత్తులో కొందరు యువకులు బడులను తమ వికృత చేష్టలకు వేదికగా చేసుకుంటున్నారు.ములకలపల్లి మండలంలోని జగన్నాథపురం ప్రాథమిక పాఠశాలలో తాజాగా జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత కొందరు గుర్తుతెలియని ఆకతాయిలు పాఠశాల ప్రాంగణంలోకి ప్రవేశించి వీరంగం సృష్టించారు. శుక్రవారం ఉదయం పాఠశాలకు చేరుకున్న ప్రధానోపాధ్యాయుడు (హెచ్‌ఎం) స్టాఫ్ రూమ్ తాళాలు విరిగి ఉండటాన్ని చూసి విస్మయానికి గురయ్యారు. కంప్యూటర్ గది తాళాన్ని సైతం పగులగొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించిన ఆనవాళ్లు కనిపించాయి. నిత్యం బడి ప్రాంగణంలో మద్యం సీసాలు, సిగరెట్ పీకలు దర్శనమిస్తున్నాయని, వ్యసనపరులు బడిని అడ్డాగా మార్చుకున్నారని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మత్తు కోరల్లో గ్రామాలు.. స్థానికుల ఆందోళన: చుట్టు పక్కల ప్రాంతాలైన పాల్వంచ, భద్రాచలం, అశ్వారావుపేట ప్రాంతాల్లో గంజాయి రవాణా ఎక్కువగా వెలుగుచూస్తున్న నేపథ్యంలో, మండలంలోని మారుమూల గ్రామాల్లోకీ ఈ మత్తు జాడ్యం విస్తరిస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ములకలపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పరిసరాల్లో రాత్రివేళల్లో సిగరెట్లలో గంజాయి నింపి సేవిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మత్తులో యువకులు మితిమీరిన వేగంతో, సైలెన్సర్ల శబ్దాలతో ద్విచక్ర వాహనాలు నడుపుతూ రోడ్లపై హల్‌చల్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిఘా పెంచుతాం.. కఠిన చర్యలు: ఎస్సై మధు ప్రసాద్ ఈ ఘటనపై ములకలపల్లి ఎస్సై మధు ప్రసాద్ మాట్లాడుతూ.. పాఠశాలలో ఎలాంటి దొంగతనం జరగలేదని, కేవలం ఆకతాయిలే తాళాలు పగులగొట్టినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని తెలిపారు. రాత్రివేళల్లో పాఠశాల ఆవరణలో మద్యం సేవిస్తున్న వారిపై ప్రత్యేక నిఘా ఉంచామని చెప్పారు. గ్రామంలో పెట్రోలింగ్ ముమ్మరం చేసి, ఇలాంటి ఆకతాయి చేష్టలకు పాల్పడే వారిని గుర్తించి కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
.
Aksharam Telugu Daily