D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/వైరా టౌన్ నవంబర్ 4( అక్షరం న్యూస్) వైరా మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు సోమవరం గ్రామం ఎస్సీ కాలనీ (మాలపల్లి)కి వెళ్లే ప్రధాన రహదారి ఇటివల కురిసిన వర్షాలకు పూర్తిగా బురదమయంగా మారింది. వర్షపు నీరు రోడ్డుపై నిలిచిపోయి, కాలనీకి వెళ్లే మార్గం అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితికి చేరింది. దీంతో ఆ మార్గంలో ప్రయాణించే కాలనీవాసులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాకపోకలకు తీవ్ర విఘాతం కలగడమే కాకుండా, రాత్రివేళల్లో నడవడానికి నరకయాతన అనుభవిస్తున్నామని స్థానికులు వాపోతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు అంతా గుంతలమయమై బురద పేరుకుపోవడంతో అత్యవసర సమయంలో లేదా ఇతర వాహనాలు కాలనీకి వచ్చే పరిస్థితి లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనేక ఏళ్లుగా ఈ సమస్య పునరావృతమవుతున్నా, ప్రజాప్రతినిధులు మరియు అధికారులు పట్టించుకోకపోవడంపై కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, వెంటనే తాత్కాలికంగా గ్రావెల్ తోలి రాకపోకలను పునరుద్ధరించాలని, అలాగే రోడ్డుకు శాశ్వత సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టి తమ రవాణా కష్టాలను తీర్చాలని 11వ వార్డు ఎస్సీ కాలనీ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
.
Aksharam Telugu Daily