Friday, 14 November 2025 02:28:24 AM
 Breaking
     -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

హనుమంతుని గుడి లేని గ్రామం, గూడెం ఉండొచ్చు గాని, ఇందిరమ్మ ఇండ్లు లేని తండా, గూడెం, గ్రామం ఉండదు... సీఎం రేవంత్ రెడ్డి

అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందిస్తాం.. పేదరికం నిర్మూలనకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం.. విద్య ద్వారానే పేదల జీవితాలు మారతాయి.. ఏటీసీ కేంద్రాలలో నైపుణ్య శిక్షణ అందించి మంచి ఉపాధి అవకాశాలు కల్పన.. చుండ్రుగొండ మండలం దామరచర్ల గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గోన్న సీఎం


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 03 September 2025 09:27 PM Views : 389

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : .. ఖమ్మం/చండ్రుగొండ/ సెప్టెంబర్ 3 (అక్షరంన్యూస్) హనుమంతుని గుడి లేని గ్రామం, గూడెం ఉండొచ్చు గాని, ఇందిరమ్మ ఇండ్లు లేని తండా, గూడెం, గ్రామం ఉండదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా ఇంచార్జి మంత్రివర్యులు వాకాటి శ్రీహరి, రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎంపిలు బలరాం నాయక్, రామ సహాయం రఘురాం రెడ్డి లతో కలిసి పర్యటించారు. జిల్లా పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి కి కలెక్టర్ జితేష్ వి. పాటిల్, ఎస్పి బి. రోహిత్ రాజు ఘన స్వాగతం పలికారు. బెండలపాడు గ్రామంలోని పూర్తయిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ఇందిరమ్మ ఇండ్ల పైలాన్ ను ఆవిష్కరించి లబ్ధిదారులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం చండ్రుగొండ మండలం దామరచర్ల గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ బీజం ఖమ్మం జిల్లాలో ఏర్పడిందని, ఉద్యోగాలు, నిధులు, నీళ్ళు మాకు కావాలని ఖమ్మం ప్రజలు రాష్ట్రానికి ఒక దిక్సూచి చూపించారని తెలిపారు. గూడెంలో పేద మహిళలు గత పది సంవత్సరాలుగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం ఆశగా ఎదురు చూశారని, గత పాలకులు వారి ఆశలను వమ్ము చేశారని అన్నారు. పేదల ఆత్మగౌరవం నిలబెట్టాలని ఆనాడు డాక్టర్ వైయస్సార్ సుదీర్ఘ పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్ల పథకం సాచురేషన్ పద్దతిలో అమలు చేశారని, 10 సంవత్సరాల కాలంలో 25 లక్షల ఇండ్లు పూర్తి చేశారని అన్నారు. పట్టణ ప్రాంతాలలో రాజీవ్ స్వగృహ పేరుతో ఇండ్లు అందించడం జరిగిందని అన్నారు. ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయాలని కష్టపడే తత్వం ఉన్న పొంగులేటి శ్రీనివాస రెడ్డి కు హౌజింగ్ శాఖ బాధ్యతలు అప్పగించానని అన్నారు. రైతుల భూ సమస్యలు పరిష్కరించేందుకు రెవెన్యూ శాఖ బాధ్యతలు కూడా వారికి అప్పగించామని అన్నారు. నేడు లక్షలాది రైతుల భూ సమస్యలను భూ భారతి ద్వారా పరిష్కరించడమే కాకుండా, 4.5 లక్షల మంది నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందించడంలో మంత్రి పొంగులేటి కీలక పాత్ర పోషించారని అన్నారు. నిరుపేదల కళ్ళలో ఆనందం చూస్తే చాలా సంతృప్తి ఉందని, జూబ్లీహిల్స్ లో తన ఇంటి గృహప్రవేశం నాడు ఉన్న సంతోషం కంటే నేడు పేద ప్రజల గృహప్రవేశం చూస్తుంటే ఇంకా ఎక్కువ ఆనందం కలిగిందని సీఎం తెలిపారు. రాష్ట్రమంతా అసెంబ్లీ నియోజకవర్గానికి 3500 ఇండ్లు మంజూరు చేస్తే, అశ్వారావుపేట లో మాత్రం 4500 ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. పేదరికం తమకు ఎక్సర్షన్ కాదని, జీవన విధానంలో ఒక భాగం అని, పేదరికం తరమాలని తాము కృషి చేస్తున్నామని అన్నారు. గత పాలకుల హయాంలో రేషన్ కార్డు జారీ లేదని, కనీసం కొత్త పేర్ల నమోదు కూడా చేయలేదని సీఎం విమర్శించారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు అందించామని అన్నారు. గతంలో పేదలకు దొడ్డు బియ్యం సరఫరా చేస్తే నేడు తమ ప్రభుత్వం సన్న బియ్యం అందిస్తుందని అన్నారు. ప్రతిపక్ష పార్టీ పంచాయతీలలో తమను లాగవద్దని, పేదలకు రేషన్ కార్డుల పంచే కార్యక్రమంలో బిజీగా ఉన్నామని సీఎం తెలిపారు. 25 లక్షలకు పైగా రైతులకు 20 వేల 600 రూపాయలతో రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేసామని, 9 రోజులలో 9 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందని అన్నారు. గత 20 నెలల కాలంలో లక్షా 4 వేల కోట్ల రూపాయలు రైతుల సంక్షేమం కోసం ఖర్చు చేయడం జరిగిందని అన్నారు. 50 లక్షల పైగా పేద కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని అన్నారు. పేదల తలరాతను మార్చేందుకు విద్య చాలా కీలకమని, ప్రస్తుత సంవత్సరం విద్య రంగంపై 40 వేల కోట్ల వరకు ఖర్చు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని అన్నారు. 100 నియోజకవర్గాలలో 20 వేల కోట్లు పైగా ఖర్చు చేస్తూ యంగ్ ఇండియా సమీకృత గురుకులాలను నిర్మిస్తున్నామని, 40 శాతం డైట్ చార్జీలు, 200 శాతం కాస్మోటిక్స్ చార్జీలను పెంచడం జరిగిందని అన్నారు. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ లను ఏర్పాటు చేసి నాణ్యమైన నైపుణ్య శిక్షణ అందించి మంచి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అన్నారు. పేదలు చదువుకునేలా స్థానిక ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని అన్నారు. యువత చదువు పై దృష్టి పెట్టాలని, మనం పది మందికి సహాయం చేసేటట్లు ఎదగాలని, దానికి విద్య చాలా అవసరమని అన్నారు. రాబోయే 10 రోజులలో నియోజక వర్గాల వారీగా ఎంపీలను, ఎమ్మెల్యేలను పిలిచి పరిష్కరించాల్సిన సమస్యలపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను, ఇంచార్జి మంత్రివర్యులను ఆదేశించారు. జిల్లా ఇంచార్జి మంత్రివర్యులు వాకాటి శ్రీహరి మాట్లాడుతూ.. గత పాలకులు పేద ప్రజలను డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరిట మోసాలకు గురి చేశారని విమర్శించారు. గతంలో వైఎస్సార్ హయాంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు అందించారని తెలిపారు. ప్రస్తుతం అదే తరహాలో మన రేవంతన్న గూడు లేని పేదలకు ఇండ్లు నిర్మించి ఇస్తున్నారని ఆయన తెలిపారు. ప్రజా శ్రేయస్సు లక్ష్యంగా ఎమ్మెల్యేలు, మంత్రులు పనిచేస్తున్నామని అన్నారు. ఎన్నికల సమయంలో హామి ఇవ్వకపోయినా, గత పాలకులు అప్పు కుప్పలు చేసినప్పటికి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు. చివరి లబ్ధిదారుడి వరకు సంక్షేమం అందాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని అన్నారు. రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా పేదల ఆత్మ గౌరవాన్ని కాపాడే దిశగా ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు చేస్తున్నామని అన్నారు. మొదటి ఏడాది ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3500 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసామని అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గిరిజన నియోజకవర్గాలలో అదనపు ఇండ్లు మంజూరు చేయాలని అశ్వరావుపేటకు 1000 ఇందిరమ్మ ఇండ్లను అధికంగా అందించామని, ఐటీడీఏ పరిధిలో 25 వేల ఇండ్లు, చెంచుల ఉప కులాల వారికి 13 వేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని మంత్రి తెలిపారు. 22 వేల 500 కోట్ల రూపాయలు మొదటి విడతలో ఖర్చు చేస్తూ పేదలకు ఇండ్లు నిర్మిస్తున్నామని అన్నారు. ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఖాతాలలో డబ్బులు జమ చేస్తున్నామని అన్నారు. 2004 నుంచి 2014 మధ్య సమయంలో వైఎస్ఆర్ హయాంలో 23 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసామని, అదే విధంగా ప్రస్తుతం కూడా అర్హులైన చివరి పేదవారి వరకు రాజకీయాలకతీతంగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం మొదటి సంవత్సరం 24 వేల కోట్ల రుణాలు పంపిణీ చేసిందని అన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ సరఫరా, సన్న బియ్యం సరఫరా, 7 లక్షల నూతన రేషన్ కార్డుల జారీ, సన్న వడ్లకు 500 రూపాయల బోనస్, 21 వేల కోట్ల రుణమాఫీ, 9 రోజులలో 9 వేల కోట్ల రైతు భరోసా నిధులు జమ చేసామని అన్నారు. ప్రజా ప్రభుత్వం బేషజాలకు పోకుండా గత పాలకులు దత్తత తీసుకున్న వాసాలమర్రి, చింతమడక గ్రామాలకు కూడా అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందిస్తుందని అన్నారు. ఖమ్మం ఎంపి రామ సహాయం రఘురాం రెడ్డి మాట్లాడుతూ, 55 లక్షల మంది పేద కుటుంబాలకు జీరో కరెంట్ బిల్లు వస్తుందని, 4 వేల కోట్ల సంవత్సరానికి ఖర్చు చేస్తూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని, 14 వేల కోట్లతో సన్న బియ్యం, 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ, రైతు భరోసా పథకం అమలు వంటి అనేక కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. ప్రజా ప్రభుత్వ హయంలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని అన్నారు అశ్వారావు పేట ఎమ్మెల్యే ఆది నారాయణ మాట్లాడుతూ.. నేడు ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు పేదలకు చేరాయని అన్నారు. చంద్రుగొండ మండలం బెండలపాడు గ్రామానికి ఇందిరమ్మ ఇండ్లను పైలెట్ ప్రాజెక్టు క్రింద మంజూరు చేశామని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అశ్వరావు పేట నియోజకవర్గం పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల పురోగతిలో ముందు ఉందని అన్నారు. నేడు గృహ ప్రవేశం జరుపుకున్న లబ్ధిదారుల్లో ఆనందం కనపడింది అని అన్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ... ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అనేక పోరాటాలు చేసిన ముఖ్యమంత్రి పరిపాలన వచ్చిన తర్వాత సంయమనం కోల్పోకుండా ప్రజాస్వామ్య బద్దంగా పాలన సాగిస్తున్నారని అన్నారు. పేదలకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, అర్జి పెట్టుకున్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు, పేదలకు సన్న బియ్యం సరఫరా, రైతు రుణమాఫీ, రైతు భరోసా వంటి అనేక హమీలను నెరవేర్చడం జరిగిందని అన్నారు. సీతారామ ఎత్తిపోతల పథకంపై దృష్టి పెట్టి సాగునీటి సరఫరా పెంచాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు. గిరిజనులు, ఆదివాసీలు, నిరుపేదలు సాగు చేసుకుంటున్న అడవి భూములకు పట్టాలు అందించాలని అన్నారు. కొత్తగూడెం జిల్లా కేంద్రానికి బస్టాండ్ మంజూరు చేయాలని, భద్రాద్రి ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, రాష్ట్ర హౌజింగ్ ఎండి వి.పి. గౌతం, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, వైరా మాలోతు మాలోతు రాందాస్ నాయక్, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, రాష్ట్ర ఇరిగేషన్ అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, అదనపు కలెక్టర్ లు, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, స్వయం సహాయక సంఘ సభ్యులు, ప్రజలు, సంబంధిత అధికారులు,ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :