AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / జనగామ/రఘునాథపల్లి : --' జనగామ జిల్లా/రఘునాథపల్లి/( అక్షరం న్యూస్) సెప్టెంబర్ 02: నాణ్యమైన విత్తనోత్పత్తి, ఆధునిక యాంత్రీకరణతోనే రైతులకు అధిక దిగుబడి,ఆర్థిక భరోసా సాధ్యమవుతుందని వ్యవసాయ రంగ నిపుణులు స్పష్టం చేశారు. అధునాతన సాంకేతికతను జోడించి విత్తన రంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు, భవిష్యత్ కార్యాచరణ ప్రయోజనాలపై పలు అంశాలను అడ్వాంట గ్లోబల్ సీఈవో భూపేన్ వి దూబే,ఆసియా, ఆఫ్రికా ప్రాంతీయ ప్రతినిధి బెళగంవార్, గ్లోబల్ చీఫ్ సప్లై ఆఫీసర్ చెరుకు రమేష్ లు వివరించారు. బుధవారం జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం బానాజీపేట గ్రామ శివారులోని అడ్వాంట కంపెనీలో జరిగిన కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వారు అనేక అంశాలపై కూలంకషంగా వివరించారు. 30 ఏళ్ల క్రితమే కరీంనగర్‌లో తొలి అడుగు పడిందని, గతంలో సరైన షెల్లర్లు లేక పంట కోత అనంతరం విత్తనాలు విరిగిపోయి నాణ్యత, మొలకశాతం దెబ్బతినేదని గుర్తుచేశారు. ఈ సమస్యను అధిగమించేందుకు 30 ఏళ్ల క్రితమే సుమారు రూ.50 లక్షల పెట్టుబడితో కరీంనగర్‌లో 'HS60' అధునాతన షెల్లర్ మెషిన్‌ను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఆరుబయట కళ్ళాల్లో ఆరబెట్టిన విత్తనాలు అకాల వర్షాలకు కొట్టుకుపోవడంతో, నెడిపల్లి గ్రామంలో మొదటిసారిగా ఆధునిక డ్రైయర్లను అందుబాటులోకి తెచ్చారు. కేవలం 2 ఎకరాలతో ప్రారంభమైన ఈ ప్రస్థానం, ప్రస్తుతం 8,000 మెట్రిక్ టన్నుల స్థాయికి చేరిందని, వైఫల్యాల రేటును 2 శాతం కంటే తక్కువకు పరిమితం చేశామని పేర్కొన్నారు. 'యునిమార్ట్' ద్వారా సాంకేతిక పరికరాలు – పెట్టుబడులకు ఆహ్వానం రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గించి, అంతర్జాతీయ స్థాయి నాణ్యతను అందించడమే లక్ష్యంగా 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ సీడ్ ప్రొడక్షన్' కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఇలాంటి మరో 6 కేంద్రాలను ప్రారంభించనున్నారు. 'యునిమార్ట్' (UniMart) ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వ్యవసాయ యంత్రాలపై పెట్టుబడి పెట్టవచ్చని, ఆ మెషిన్లను యునిమార్ట్ ద్వార రైతులకు అందుబాటులో ఉంచి, పెట్టుబడిదారులకు నికర లాభాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఖమ్మం లాంటి ప్రాంతాల్లో ఒక్క హార్వెస్టింగ్ పనులకే ఎకరాకు రూ.15,000 వరకు ఖర్చవుతోందని, చిన్న తరహా యంత్రాలు, డీ-హస్కింగ్ మెషిన్ల ద్వారా ఈ భారాన్ని గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. డిజిటల్ పర్యవేక్షణ, వాతావరణ అంచనాలతో నష్ట నివారణ తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే కొత్త సీడ్ యాక్ట్ తీసుకొచ్చి దళారీ వ్యవస్థను రూపుమాపేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, ఈ కేంద్రాలు రైతులకు మరింత రక్షణగా నిలుస్తాయని వెల్లడించారు. 'ఈగిల్ ఐ' పర్యవేక్షణ, 'క్రాప్ పల్స్' యాప్ మరియు బెంగళూరులోని 200 మంది ఐటీ నిపుణుల బృందం ద్వారా ఫీల్డ్ మ్యాపింగ్, పంట డేటాను పక్కాగా నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ వాతావరణ సంస్థ సహకారంతో 90 శాతం కచ్చితత్వంతో కూడిన ముందస్తు సమాచారాన్ని ఉపయోగించి, నిజామాబాద్ జిల్లాలో సుమారు 600 ఎకరాల్లో జరగాల్సిన విత్తనోత్పత్తి నష్టాన్ని కాపాడగలిగారు. గతేడాది 60,000 ఎకరాల్లో ఆధునిక సాంకేతికతను అమలు చేసి దిగుబడిని 20 శాతం మేర పెంచామని, నేడు ఆసియా-పసిఫిక్ రీజియన్‌లోనే 50,000 మెట్రిక్ టన్నులకు పైగా నాణ్యమైన విత్తనాన్ని సరఫరా చేస్తూ అగ్రగామిగా నిలిచామని వివరించారు. రైతులకు నిత్య ఆదాయం రావాలి: కూరగాయల సాగుపై పిలుపు ఒకే పంటపై ఆధారపడి నష్టపోకుండా, కనీసం ఐదు గుంటల విస్తీర్ణంలో కొత్తిమీర, కరివేపాకు వంటి ఆకుకూరలు, కూరగాయలు పండించాలని రైతులకు సూచించారు. దీని ద్వారా రోజువారీ కూలీల ఖర్చులకు తగిన ఆదాయం సమకూరుతుందని, ఆంకాపూర్ రైతుల తరహాలో వ్యవసాయాన్ని ఒక ప్రొఫెషనల్ వ్యాపారంగా మలుచుకోవాలని పిలుపునిచ్చారు. నాణ్యమైన విత్తనమే వ్యవసాయానికి తొలి పునాది అని, రైతుల జీవితాలను మార్చేందుకు సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో యుపిఎల్ సీఈవో చెరుకు రవిశంకర్, యుపిఎల్ యూనిట్ జాతీయ ప్రతినిధి తుశర్ త్రివేది, భారతి గ్రూప్ ఇండస్ట్రీ చైర్మన్ బొత్స బ్రహ్మానంద రెడ్డి, యూని మార్ట్ అడ్వాంట ప్రతినిధులు, బంజిపేట గ్రామ సర్పంచ్ గైని శ్రీనివాస్, కొమురవెల్లి దేవస్థానం డైరెక్టర్, మాజీ మండల రైతు కోఆర్డినేటర్ గొరిగి రవి, గ్రామ వార్డు సభ్యులు పెద్ద సంఖ్యలో రైతులు, పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily