AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ జూలై 04 అక్షరం న్యూస్ జిల్లాలో విద్యా విద్యా ప్రమాణాల పెంపుకు పటిష్టమైన కార్యాచరణను అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రాథమిక ఉపాధ్యాయుల డీఆర్‌పీ బృందం సమీక్ష సమావేశంలో గత సంవత్సరం మాదిరిగానే ఈ విద్యా సంవత్సరంలో కూడా ప్రాథమిక స్థాయి విద్యార్థుల తరగతి వారీ అభ్యాస సామర్థ్యాలను పెంపొందించేందుకు రూపొందించిన వార్షిక విద్యా ప్రణాళిక అమలుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నెల స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని, పాఠశాల స్థాయి సమీక్షలను క్రమం తప్పకుండా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతి పాఠశాలలో ఎఫ్‌ఎల్‌ఎన్ కార్యక్రమం సమర్థవంతంగా అమలయ్యేలా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ప్రతి స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో విద్యార్థుల నమోదు అధికంగా ఉన్న ఐదు ప్రాథమిక పాఠశాలలను ఎంపిక చేసి వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ఆయా పాఠశాలల్లో విద్యార్థుల అభ్యాస సామర్థ్యాలను ప్రతి నెల సమీక్షిస్తూ, అవసరమైన మెరుగుదల చర్యలు చేపట్టాలని అధికారులకు తెలిపారు. ఎంపిక చేసిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో త్వరలో ప్రత్యేక సమావేశం నిర్వహించి, విద్యా ప్రమాణాల పెంపు, సమర్థవంతమైన బోధన, అభ్యాస ఫలితాల మెరుగుదలపై ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా రూపొందించిన వార్షిక విద్యా ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేసి ప్రతి విద్యార్థి అభ్యాస సామర్థ్యాలను మెరుగుపరిచే దిశగా అన్ని స్థాయిల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాధికారి శారద, జిల్లా అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ షేక్, అలోకిట్ పర్యవేక్షకులు, ప్రాథమిక స్థాయి డీఆర్‌పీ బృందం సభ్యులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily