D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/స్టాఫ్ రిపోర్టర్ సత్తుపల్లి/ జూన్ 12 (అక్షరంన్యూస్) తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దిశగా గత పదకొండు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే మార్గదర్శకంగా నిలుస్తున్నాయని, లక్షలాది మందికి ప్రత్యక్షంగా లబ్ధి చేకూర్చిన ఘనత బీజేపీ పాలనకే చెందుతుందని బీజేపీ జాతీయ నాయకుడు, కర్ణాటక–తమిళనాడు రాష్ట్రాల కో ఇంచార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. గురువారం సత్తుపల్లిలో జరిగిన ప్రొఫెషనల్ మీట్‌లో మాట్లాడుతూ, పీఎం కిసాన్ సన్మాన్ నిధి పథకం ద్వారా రాష్ట్రంలో 31.30 లక్షల మంది అర్హులలో 31.20 లక్షల మందికి నిధులు పంపిణీ అయినట్లు వివరించారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 99 శాతం నిధుల బదిలీ విజయవంతంగా జరిగిందని చెప్పారు. పీఎం ముద్రా యోజన కింద 75 లక్షల రుణ ఖాతాలు మంజూరై రూ.72 వేల కోట్లకు పైగా రుణాలు లబ్ధిదారులకు అందాయని వివరించారు. గ్రామీణ యువతలో స్వావలంబనకు ఇది బీజం వేశదని అన్నారు. పీఎం జనధన్ యోజన కింద రాష్ట్రవ్యాప్తంగా 1.27 కోట్ల మంది ఖాతాదారులకు రూ.517 కోట్ల నిధులు జమ కాగా, పీఎం స్వనిధి ద్వారా నాలుగు లక్షల మందికి రూ.1247 కోట్లు మంజూరు అయ్యాయని తెలిపారు. వీధి విక్రేతలు, పట్టణాల పేదలకు ఇది ఆశాజ్యోతి లాంటిదని పేర్కొన్నారు. పీఎం ఆవాస్ యోజన ద్వారా ఇప్పటివరకు 3.6 లక్షల ఇళ్లకు మంజూరై, 2.2 లక్షల ఇళ్లు పూర్తయ్యాయని, ఇందుకోసం రూ.6150 కోట్లు మంజూరై రూ.3800 కోట్లు విడుదలైనట్టు వెల్లడించారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద రాష్ట్రంలో 14331 కిలోమీటర్లకు మంజూరై 12800 కిలోమీటర్ల రహదారులు, 383 వంతెనల నిర్మాణాలు పూర్తయ్యాయని వివరించారు. ఈ పథకానికి కేంద్రం రూ.4948 కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద రాష్ట్రంలో 82.59 లక్షల ఆరోగ్య కార్డులు జారీ అయ్యాయని, కేవలం గత నెలలోనే 6,268 కార్డులు మంజూరైనట్లు తెలిపారు. 2019 నుండి ఇప్పటివరకు రాష్ట్రంలో 1488 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణానికి రూ.19,000 కోట్లకు పైగా ఖర్చు చేశారని చెప్పారు. ఉజ్వల యోజన కింద 11.84 లక్షల గ్యాస్ కనెక్షన్లు మంజూరై, పేద మహిళల జీవితాల్లో గృహోత్సాహాన్ని కలిగించిందన్నారు. గరీబ్ కల్యాణ్ అన్న పథకం ద్వారా రాష్ట్రంలో 5.67 లక్షల కుటుంబాలకు 1.90 కోట్ల మందికి నిత్యావసర సరుకులు అందించబడ్డాయని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పాలనలోనూ, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలోనూ అభివృద్ధికి మార్గం కనిపించలేదని, కేంద్ర పథకాల వల్లే రాష్ట్రానికి అభివృద్ధి సాధ్యమైందని, రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని సక్రమంగా అమలు చేయడంలో విఫలమయ్యాయని విమర్శించారు. ఈ సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావుతో పాటు ఇవి రమేష్ , నంబూరి రామలింగేశ్వర రావు, సుదర్శన్ మిశ్రా, మధుసూదన్, నాయుడు రాఘవరావు,మట్ట ప్రసాద్, బట్టు వీరంరాజు, ఆచంట నాగస్వామి, విజయ్, సాలి సాయి, నల్లమోతు నాని తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily