DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : .. దొమ్మటి రాజేష్, అక్షరం ప్రతినిధి పెద్దపల్లి; పెద్దపల్లి మున్సిపల్ ఎన్నికలు రోజురోజుకు రాజకీయ ఉత్కంఠను పెంచుతున్నాయి. మొదట కాంగ్రెస్–బీఆర్ఎస్ మధ్యే పోటీ ఉంటుందని భావించిన సమీకరణాలు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. ఇండియన్ ఫార్వర్డ్ బ్లాక్ (ఐఎఫ్‌బీ) పార్టీ సింహం గుర్తుతో ఒకేసారి 23 వార్డుల్లో బలమైన అభ్యర్థులను నిలబెట్టడంతో పెద్దపల్లి రాజకీయాల్లో కొత్త పవర్ సెంటర్ రూపుదిద్దుకుంటోంది. 36 వార్డుల పోరు… 23 చోట్ల సింహం దూకుడు మొత్తం 36 వార్డులున్న పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో కాంగ్రెస్ – 36 వార్డులు బీఆర్ఎస్ – 35 వార్డులు బీజేపీ – 26 వార్డులు పోటీ చేస్తుండగా, ఐఎఫ్‌బీ 23 వార్డుల్లో సింహం గుర్తుతో బరిలో నిలవడం ఈ ఎన్నికలను త్రిముఖ రాజకీయ సమరంగా మార్చింది. కవిత రాజకీయ వ్యూహం… బీఆర్ఎస్ పరిధిని దాటి ఈ ఎన్నికల్లో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాత్ర ప్రత్యేకంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ పరిమితులకు అతీతంగా, మున్సిపల్ రాజకీయాలను స్వతంత్రంగా ప్రభావితం చేసే వ్యూహకర్తగా కవిత ముందుకు రావడం గమనార్హం. కాంగ్రెస్ అసంతృప్తులు, బీఆర్ఎస్ నుంచి దూరమైన నేతలు, బీజేపీలో అవకాశాలు లేని కీలక నాయకత్వాన్ని ఒకే వేదికపైకి తీసుకురావడమే లక్ష్యంగా ఐఎఫ్‌బీని రాజకీయ వాహనంగా ఎంచుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి కీలక నేతల వలస… సింహం వైపు భారీ షిఫ్ట్ అధికార కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. పార్టీకి సుదీర్ఘకాలంగా సేవ చేసిన పలువురు నేతలకు టికెట్ దక్కకపోవడంతో, వారు ఐఎఫ్‌బీ సింహం గుర్తుపై బరిలోకి దిగారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జడల సురేందర్ – 23వ వార్డు, ఎమ్మెల్యే ప్రధాన అంశాల తిరుమలరావు – 13వ వార్డు కాజా – 30వ వార్డు షంషీ బేగ్ – 26వ వార్డు కుక్క శ్రావణ్ – 26వ వార్డు గణపతి రాజేష్ – 20వ వార్డు బండారు సునీల్ – 21వ వార్డు ఇండియన్ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున బరిలోకి దిగారు. వీరంతా కాంగ్రెస్‌లో కీలకంగా పనిచేసిన నాయకులే కావడంతో, ఇది కేవలం పార్టీ మార్పుగా కాకుండా ఓటు బ్యాంకు మార్పుగా రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచీ ఎదురుదెబ్బ… మాజీ కౌన్సిలర్ ఎంట్రీ కాంగ్రెస్‌తో పాటు బీఆర్ఎస్ (టీఆర్ఎస్) నుంచి కూడా కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్ మరి పెళ్లి జలజ భర్త సతీష్ ఆ పార్టీని వీడి సింహం గుర్తుతో ఎన్నికల బరిలో నిలవడం బీఆర్ఎస్ శిబిరంలో కలకలం రేపుతోంది. బీజేపీ కోటలోనూ ముందే చీలిక… కొలిపాక కుటుంబం ఎంట్రీ.. బీజేపీ పార్టీలో కూడా కీలక చీలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బీజేపీలో కీలకంగా వ్యవహరించిన కొలిపాక శ్రీనివాస్, ఆయన సోదరులు సంపత్, చిరంజీవి ముందుగానే కల్వకుంట్ల కవితతో మంతనాలు జరిపి ఐఎఫ్‌బీ తరఫున కౌన్సిలర్ అభ్యర్థులుగా బరిలోకి దిగారు. అలాగే బీజేపీ నుంచి కనకరాజు భార్య కూడా ఐఎఫ్‌బీ తరఫున ఎన్నికల బరిలోకి దిగడం బీజేపీకి మరో ఎదురుదెబ్బగా మారింది. చైర్మన్ అభ్యర్థి ముందే ప్రకటన… కవిత స్పష్టమైన సంకేతం మున్సిపల్ ఎన్నికలకు ముందే కొలిపాక శ్రీనివాసును చైర్మన్ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత ప్రకటించడం రాజకీయంగా కీలక పరిణామంగా మారింది. దీంతో ఐఎఫ్‌బీ కేవలం పోటీలో నిలిచిన పార్టీ కాకుండా, పాలనా లక్ష్యంతో ముందుకెళ్తున్న శక్తిగా అవతరిస్తోందన్న సంకేతాలు స్పష్టమయ్యాయి. ఓటు చీలికా… లేక కొత్త రాజకీయ శక్తియా? ప్రస్తుతం పెద్దపల్లి రాజకీయాల్లో ప్రధాన చర్చ సింహం గుర్తు ఓటును చీల్చుతుందా? లేక కొత్త రాజకీయ శక్తిగా అవతరిస్తుందా? అన్నదే. పలువురు ఐఎఫ్‌బీ అభ్యర్థులు తమ తమ వార్డుల్లో నేరుగా గెలుపు పోరులో ఉండటంతో, కాంగ్రెస్–బీఆర్ఎస్ లెక్కలు పూర్తిగా తారుమారు అవుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పెద్దపల్లి రాజకీయాల్లో కొత్త అధ్యాయం సింహం గర్జనతో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తప్పదా? బీఆర్ఎస్ బలహీనతలు బహిర్గతమవుతాయా? ఐఎఫ్‌బీ చరిత్రాత్మక ఫలితం సాధిస్తుందా? అన్న ప్రశ్నలకు సమాధానం పోలింగ్ రోజే తేలనుంది. మొత్తానికి పెద్దపల్లి మున్సిపల్ ఎన్నికలు కవిత వ్యూహంతో, సింహం ఎంట్రీతో రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయంగా మారుతున్నాయి.
.
Aksharam Telugu Daily