GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మంచిర్యాల జిల్లా : * - మంచిర్యాల జిల్లా /బెల్లంపల్లి / ఫిబ్రవరి 7 / అక్షరం న్యూస్ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని ప్రభుత్వ సమీకృత బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ చోటుచేసుకోవడం అధికారుల పర్యవేక్షణ లోపానికి మరియు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య మండిపడ్డారు. వసతి గృహంలో కలుషిత ఆహారం తిని సుమారు 20 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురికాగా, వారిని బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే శనివారం ఎమ్మెల్సీ హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. *అధికారుల పర్యవేక్షణ లోపంపై ఆగ్రహం:* విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఎమ్మెల్సీ, వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ మరియు వైద్యులను ఆదేశించారు. అనంతరం జిల్లా సబ్ కలెక్టర్ మనోజ్‌తో ఫోన్‌లో మాట్లాడి ఘటనపై పూర్తి వివరాలు కోరారు. "ప్రభుత్వ వసతి గృహాల్లో తరచూ ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? అధికారుల పర్యవేక్షణ ఎందుకు లోపిస్తోంది?" అని ఆయన నిలదీశారు. నిర్లక్ష్యానికి కారణమైన అంశాలపై సమగ్ర విచారణ జరిపి, తక్షణమే పూర్తి నివేదికను హెల్త్ డైరెక్టర్‌కు పంపాలని స్పష్టం చేశారు. *పిల్లల ప్రాణాలతో చెలగాటం వద్దు:* ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. విద్యార్థుల ప్రాణాల పట్ల ప్రభుత్వానికి కనీస బాధ్యత లేదని విమర్శించారు. వసతి గృహాలపై సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, బాధ్యులను తక్షణమే గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించి, వారు త్వరగా కోలుకునేలా చూడాల్సిన పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు.
.
Aksharam Telugu Daily