D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ! ఖమ్మం/స్టాఫ్ రిపోర్టర్ ఫిబ్రవరి 2 (అక్షరం న్యూస్) ఏదులాపురం మున్సిపాలిటీ : “పదేళ్ల పాటు ప్రజలను గాలికొదిలేసి.. ఇవాళ ఎన్నికలు రాగానే దండాలు పెట్టుకుంటూ వస్తున్న నాయకులను నమ్ముదామా? పేదోడికి ఓ రేషన్ కార్డు ఇవ్వడానికి మనసు రాని వాళ్లకు మళ్లీ ఓట్లు వేయాలా?” అంటూ తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గులాబీ నేతలపై విరుచుకుపడ్డారు. సోమవారం ఏదులాపురం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 2, 22, 23, 24, 26, 27వ వార్డుల్లో నిర్వహించిన రోడ్ షోల్లో ఆయన ప్రసంగం ఆద్యంతం వాడివేడిగా సాగింది. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఏ సంక్షేమం అర్హుల దరిచేరకుండా వారిని నమ్మించి మోసం చేసిన ఘనత ముమ్మాటికీ వారిదేనని ఎద్దేవా చేశారు. ఇప్పుడు తాము చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. *గాలి మోటార్ల నాయకులకు.. గల్లీ కష్టాలేం తెలుసు?* గత ప్రభుత్వ తీరుపై పొంగులేటి తనదైన శైలిలో సెటైర్లు వేశారు. “నాడు ఫామ్ హౌస్‌లకే పరిమితమై, గాలి మోటార్లలో తిరిగిన నాయకులకు.. ఈ గల్లీల్లో డ్రైనేజీలు పొంగుతుంటే, ఇళ్లు మునుగుతుంటే ఏనాడైనా కనిపించాయా?” అని నిలదీశారు. రాజీవ్ గృహకల్ప వాసులు ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోని వారు, ఇవాళ ఎన్నికల కోసం కొత్త నాటకాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి రాగానే అర్హులైన ప్రతి పేదవాడికి రేషన్ కార్డులు ఇచ్చి ఆకలి తీర్చామని, అది కాంగ్రెస్ మార్కు పాలన అని చెప్పారు. *ముంపు కష్టాలకు ‘రిటైనింగ్’ చెక్!* “మాట ఇస్తే మడమ తిప్పే అలవాటు తనకు లేదన్నారు... జూన్ కల్లా కరకట్ట పూర్తి చేసి మీ ముంపు కష్టాలు తీర్చి తీరుతా” అని మంత్రి మరోమారు హామీ ఇచ్చారు. రూ. 690 కోట్లతో నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ ఏదులాపురానికి రక్షణ కవచంలా మారుతుందని, రాజీవ్ గృహకల్ప ఇళ్లకు కొత్త హంగులు అద్దడంతో పాటు ప్రతి ఇంటికీ నల్లా నీరు ఇచ్చే బాధ్యత తనదని భరోసా ఇచ్చారు. ఇప్పటికే మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో కలిపి సుమారు రూ.308 కోట్లతో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయని, ఏదులాపురాన్ని రాష్ట్రానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. అభివృద్ధి కావాలంటే హస్తం గుర్తుకే ఓటేయాలని, కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని పొంగులేటి పిలుపునిచ్చారు.
.
Aksharam Telugu Daily