D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాప్ రిపోర్టర్ నవంబర్ 5 (అక్షరం న్యూస్) సత్తుపల్లి:భారీ వర్షాలు, వరదలతో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్న వేళ ప్రాణాలకు తెగించి సహాయక చర్యల్లో పాల్గొన్న రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్) సిబ్బంది సేవలు మరువలేనివని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొనియాడారు. బేతుపల్లి చెరువు ఉప్పొంగిన ప్రాంతంతో పాటు దమ్మపేట మండలంలోని పలు గ్రామాలకు వరద ముప్పు ఏర్పడిన సమయంలో ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది తక్షణమే స్పందించి చేపట్టిన సహాయక చర్యలను అభినందించారు. గురువారం సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్‌తో కలిసి మంత్రి పొంగులేటి సత్తుపల్లి మండలం బేతుపల్లి పెద్ద చెరువు వద్ద పరిస్థితిని పరిశీలించారు. అనంతరం దమ్మపేట మండలంలో మల్లెపూల వాగు, ముసలిబంధం చెరువుల వద్ద గండ్లు పడిన ప్రాంతాలను సందర్శించి వరద పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొన్న ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. వారికి శాలువాలు కప్పి సత్కరించారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు చూపిన ధైర్యసాహసాలు, అంకితభావం ప్రశంసనీయమని పేర్కొన్నారు. విధి నిర్వహణలో చూపిన తెగువకు ప్రభుత్వం తరఫున అభినందనలు తెలిపారు.
.
Aksharam Telugu Daily