AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ నవంబర్ 06 అక్షరం న్యూస్ రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి మహిళా పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ట్రాన్స్‌జెండర్ మహిళలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా పోలీస్ స్టేషన్ సీఐ రమేష్ బాబు ట్రాన్స్‌జెండర్ రక్షణ విభాగం (ప్రైడ్ ప్లేస్) పనితీరు, విధులు, సేవలపై అవగాహన కల్పించారు. ట్రాన్స్‌జెండర్లు, ఎల్‌జీబీటీక్యూఐఏ వర్గాల హక్కులు, భద్రత, గౌరవాన్ని కాపాడేందుకు తెలంగాణ పోలీస్ శాఖ ప్రత్యేక రక్షణ విభాగాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ విభాగం ద్వారా ట్రాన్స్‌జెండర్లపై జరిగే దాడులు, వేధింపులు, వివక్ష వంటి ఘటనలను అరికట్టడంతో పాటు బాధితులకు అవసరమైన పోలీస్ రక్షణ, సహాయ సహకారాలు అందిస్తామని వివరించారు. సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు, గౌరవంగా జీవించే స్వేచ్ఛ ఉందని, ట్రాన్స్‌జెండర్లు ఎలాంటి వేధింపులు, వివక్షకు గురైనా భయపడకుండా పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. వారి సమస్యల పరిష్కారానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో షీ టీమ్ ఇన్‌చార్జి ఎస్‌ఐ లావణ్య, మహిళా పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ రవళి, షీ టీమ్ సభ్యులు, మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది, భరోసా సమన్వయకర్త అశ్రీత, భరోసా సిబ్బంది, ట్రాన్స్‌జెండర్ మహిళలు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily