D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/తల్లాడ అక్టోబర్ 16 (అక్షరం న్యూస్) తల్లాడ:మండల పరిధిలోని నూతనకల్లు గ్రామంలో హరిహర సుత అయ్యప్ప స్వామి దేవాలయ ప్రతిష్టా మహోత్సవం శుక్రవారం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ ఆధ్యాత్మిక వేడుకకు సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యురాలు (ఎమ్మెల్యే) డాక్టర్ మట్టా రాగమయి, ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న ముఖ్య అతిథులకు ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు మంగళవాయిద్యాల నడుమ పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, భక్తుల శరణుఘోషతో నూతనకల్లు గ్రామం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు అడపా అనిల్ చౌదరి ఆధ్వర్యంలో యువత ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ కి తన స్వాగతం పలికారు. ముఖ్య అతిథులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గ్రామంలో అయ్యప్ప స్వామి ఆలయాన్ని ప్రతిష్టించడం శుభపరిణామమని, స్వామివారి కృపాకటాక్షాలతో ప్రజలంతా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల మధ్య ఐక్యతను, ప్రశాంతతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. అనిల్ చౌదరి వెంట యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని సేవలందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు మరియు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అయ్యప్ప భక్తులు, మహిళలు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ వారు అన్ని ఏర్పాట్లు చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నదానం పంపిణీ చేశారు.
.
Aksharam Telugu Daily