AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ నవంబర్19 అక్షరం న్యూస్ జిల్లాలోని ప్రభుత్వ గురుకుల, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ హాస్టళ్లలో నెలకొన్న అధ్వాన్న పరిస్థితులను చక్కదిద్ది,పేద విద్యార్థులకు నాణ్యమైన భోజనం, కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షులు ఇరికిళ్ల రాజనర్సయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హాస్టల్ సమస్యల పరిష్కారం కోరుతూ గురువారం బీఎస్పీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి, అనంతరం జిల్లా అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజనర్సయ్య మాట్లాడుతూ ప్రభుత్వ హాస్టళ్లలో చదువుకుంటున్న వేలాది మంది బడుగు,బలహీన వర్గాల విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.కానీ కొన్ని హాస్టళ్లలో పురుగుల అన్నం, కుళ్లిన కూరగాయలు, కలుషిత తాగునీరు అందిస్తుండటంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.ఏ ఒక్క హాస్టల్‌లోనూ నాణ్యత లేని ఆహారం వడ్డించకూడదని హెచ్చరించిన ఆయన, వంటగదులు, భోజనశాలలు, నిల్వ గదుల్లో పరిశుభ్రత పాటిస్తూ సురక్షిత తాగునీరు,నాణ్యమైన సరుకులు అందుబాటులో ఉంచాలని కోరారు.ఫుడ్ సేఫ్టీ అధికారులతో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి, నిర్లక్ష్యం వహించే వార్డెన్లు,కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రతి హాస్టల్‌లో విద్యార్థులతో కూడిన ఫుడ్ కమిటీ ఏర్పాటు చేసి,నిరంతర పర్యవేక్షణకు ప్రత్యేక తనిఖీ వ్యవస్థను తీసుకురావాలని సూచించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నీటి వసతితో కూడిన మరుగుదొడ్లు నిర్మించడంతో పాటు, విద్యార్థులు అనారోగ్యానికి గురైతే వెంటనే వైద్య చికిత్స అందించాలని,భద్రత దృష్ట్యా హాస్టల్ పరిధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు. విద్యార్థుల ఆరోగ్యం, ఆత్మగౌరవం,భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని జిల్లా ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ బాధ్యత వహించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు వరికిల్ల మల్లేశం, జింక ఉదయ్, జనగామ లింగయ్య, జనగామ రవి, బొంకూరి దుర్గయ్య, రంజిత్,పెగ నరేష్, రాఘవీర్, మాతంగి శంకర్, రామిల్ల శారద, జనగామ మల్లేష్, మధునయ్య తోపాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily