AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ ఆగష్టు 22 అక్షరం న్యూస్ జిల్లాలో తాగునీటి సరఫరాకు సంబంధించి గ్రామాల వారీగా సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో తాగునీటి అవసరాలను ముందుగానే గుర్తించి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. పెద్దపల్లి ఐడీఓసీలో శనివారం తాగునీటి సరఫరాపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ప్రతి గ్రామంలో తాగునీటి సమస్యలు, అవసరమైన పైప్‌లైన్లు, అదనపు ఓహెచ్‌ఎస్‌ఆర్‌ల ఏర్పాటు, కొత్త తాగునీటి కనెక్షన్ల అవసరాలను గుర్తించి సమగ్ర వివరాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. అందుబాటులో ఉన్న గ్రామపంచాయతీ నిధులను వినియోగించి అత్యవసరమైన చిన్నతరహా తాగునీటి పనులను వెంటనే చేపట్టాలని సూచించారు. ఆయా పనులను ఎంపీడీవోలు గుర్తించి ప్రాధాన్య క్రమంలో పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. చిన్నతరహా పనులు వెంటనే పూర్తి చేయాలి.. ఓహెచ్‌ఎస్‌ఆర్‌లలో ఏర్పడే లీకేజీలు, చిన్నపాటి మరమ్మతులు, పైప్‌లైన్ లీకేజీలను పంచాయతీ నిధులతోనే తక్షణం చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలో ప్రతిపాదించిన తాగునీటి పనులకు ప్రభుత్వ అనుమతులు, మంజూర్లు త్వరగా వచ్చేలా జెడ్పీ సీఈవో నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ప్రతిపాదిత పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన అనుమతులు సాధించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. సమస్యలు తలెత్తిన వెంటనే స్పందించి పరిష్కరించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్‌లో ఉంచవద్దని స్పష్టం చేశారు. వేసవి వంటి పరిస్థితుల్లోనే కాకుండా ముందుగానే తాగునీటి అవసరాలను అంచనా వేసి ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో జెడ్పీ సీఈవో నరేందర్, మిషన్ భగీరథ ఇంట్రా ఈఈ గంగాధర్ శ్రీనివాస్, అదనపు డీఆర్‌డీఏ అధికారి రవీందర్, ఎంపీడీవోలు, ఇతర అధికారులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily