AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపెల్లి/ గోదావరిఖని (జ్యోతి నగర్ ): : జ్యోతినగర్, ఎన్టీపీసీ అక్టోబర్ 21 పెద్దపల్లి జిల్లా అక్షరం న్యూస్: ఎన్టీపీసీ టౌన్షిప్లో విజయదశమి పండుగ రోజున నిర్వహించాల్సిన రావణ దహన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించడం స్థానిక సంప్రదాయాలకు విరుద్ధమని ఎన్టీపీసీ మజ్దూర్ యూనియన్ (ఐఎన్టీయూసీ) ప్రధాన కార్యదర్శి వేముల కృష్ణయ్య పేర్కొన్నారు. స్థానిక ప్రజల ఆచార వ్యవహారాలను గౌరవించకుండా కార్యక్రమాలు నిర్వహించడం విచారకరమని అన్నారు. ఎన్నికల్లో గెలిచిన బీఎంఎస్ యూనియన్ స్థానిక సంప్రదాయాలకు ప్రాధాన్యమివ్వాల్సింది పోయి, ఇతర ప్రాంతాల అధికారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ స్థానిక ఆచారాలకు విరుద్ధమైన కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వేముల కృష్ణయ్య తెలిపారు. స్థానిక ప్రజల మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత కార్మిక సంఘాలపై ఉందని పేర్కొన్నారు. ఎన్టీపీసీ టౌన్షిప్ భిన్న ప్రాంతాలు, భాషలు, సంస్కృతులకు చెందిన ప్రజలు కలిసిమెలిసి జీవించే మినీ భారత్లాంటిదని ఆయన అన్నారు. తెలంగాణ నేల ఇతర ప్రాంతాల ప్రజలను ఆప్యాయంగా ఆదరించే గొప్ప సంస్కృతికి నిలయమని, ఇక్కడి సంప్రదాయాలను కూడా అందరూ గౌరవించాలని సూచించారు. విజయదశమి రోజున రావణ దహనం నిర్వహించడం స్థానికంగా అనుసరిస్తున్న సంప్రదాయమని, అందుకు భిన్నంగా మరుసటి రోజు నిర్వహించడం స్థానిక ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఎన్టీపీసీ యాజమాన్యం, సంబంధిత కమిటీలు తగిన చర్యలు తీసుకోవాలని వేముల కృష్ణయ్య కోరారు. స్థానిక సంప్రదాయాలకు విరుద్ధంగా మళ్లీ వ్యవహరిస్తే కార్మికులు, స్థానిక ప్రజల తరఫున ఐఎన్టీయూసీ నిరసన కార్యక్రమాలు చేపడుతుందని స్పష్టం చేశారు.
.
Aksharam Telugu Daily