GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మంచిర్యాల జిల్లా : మంచిర్యాల జిల్లా /బెల్లంపల్లి /జనవరి 22 /అక్షరం న్యూస్ - బెల్లంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి జ్వాలలు ఎగిసిపడ్డాయి. ఏనాడు పార్టీ జెండా పట్టని రత్నం లక్ష్మికి బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కట్టబెట్టడం అప్రజాస్వామికమని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దుర్గం గోపాల్ ధ్వజమెత్తారు. గురువారం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే గడ్డం వినోద్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజమైన కార్యకర్తలకు అన్యాయం: పార్టీ కోసం లాఠీ దెబ్బలు తిని, కేసులు ఎదుర్కొన్న సీనియర్ నాయకులను విస్మరించి, కాసిపేట మండల అధ్యక్షుడు రత్నం ప్రదీప్ తల్లి రత్నం లక్ష్మికి పదవి ఇవ్వడం వెనుక భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. కొంతమంది కుహనా నాయకుల మాటలు నమ్మి, సుమారు రూ. 25 లక్షలకు ఈ పదవిని అమ్ముకున్నారని ఆయన ఎద్దేవా చేశారు. "ఒకే ఇంట్లో రెండు పదవులు ఎలా ఇస్తారు? జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి కూడా ప్రదీప్ తండ్రికి ఇస్తే సరిపోతుంది కదా!" అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పదవిని వెంటనే తొలగించాలి: మార్కెట్ కమిటీ పదవిని ఆశించిన చిలుముల శంకర్, ముడిమడుగుల మహేందర్, దుర్గం లక్ష్మి, జుమ్మిడి బానయ్య వంటి సీనియర్ నేతలు ఎమ్మెల్యేకు కనబడలేదా అని ప్రశ్నించారు. అప్రజాస్వామికంగా జరిగిన ఈ నియామకాన్ని వెంటనే రద్దు చేసి, పార్టీ కోసం కష్టపడ్డ వారికే పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని, బెల్లంపల్లిలో కాంగ్రెస్ 30 ఏళ్లు వెనక్కి పోతుందని హెచ్చరించారు. అవినీతి అక్రమాలపై పిర్యాదు: కాసిపేట మండలంలో డీఎంఎఫ్‌టీ నిధుల్లో రత్నం ప్రదీప్ భారీగా పర్సంటేజీలు తీసుకుంటున్నాడని, ఎన్నికల ఖర్చు కోసం ఇచ్చిన నిధులను కూడా సొంతానికి వాడుకున్నాడని దుర్గం గోపాల్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై జిల్లా అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్ రెడ్డి స్పందించడం లేదని, త్వరలోనే ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రి మరియు పార్టీ రాష్ట్ర ఇన్చార్జిలకు వ్యక్తిగతంగా ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
.
Aksharam Telugu Daily