AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ అక్టోబర్ 16 అక్షరం న్యూస్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన లబ్దిదారులకు నిరంతరం క్రమం తప్పకుండా కల్యాణలక్ష్మి, షాదీ ముభారక్ చెక్కులు అందిస్తున్నట్లు రాష్ర్ట ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు తెలిపారు. రైతులు ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో సాగునీటి కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులందరూ సహకరించాలని కోరారు. పెద్దపల్లి ఆర్.కె. గార్డెన్స్‌లో పట్టణం, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 63 మంది లబ్ధిదారులకు రూ.63,07,308 విలువైన కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను స్థానిక నాయకులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అర్హులైన లబ్ధిదారులకు క్రమం తప్పకుండా కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ వంటి పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ఈ సీజన్లో పంట పొలాలకు సాగునీరు అందించేందుకు జిల్లా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నేతృత్వంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిని కలిసి చర్యలు తీసుకున్నట్లు విజయరమణరావు తెలిపారు. రైతులు వరికి బదులుగా ఇతర పంటలను సాగు చేయాలని, వాటిని ప్రభుత్వపరంగా కొనుగోలు చేసే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య, తహసీల్దార్ రాజయ్య, సింగిల్‌విండో చైర్మన్లు, డైరెక్టర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పట్టణ, మండల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily