SOUDAMALLA. YOHAN Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్ : కరీంనగర్/వీణవంక/జనవరి 06/అక్షరం న్యూస్: వీణవంక మండల పరిధిలో చైనా మంజా (నైలాన్ దారాలు) వినియోగం పూర్తిగా నిషేధమని వీణవంక ఎస్‌ఐ ఆవుల తిరుపతి స్పష్టం చేశారు. పండగల సందర్భంగా గాలిపటాలు ఎగరేసే సమయంలో చైనా మంజా వాడటం వల్ల పక్షులు, పశువులు, ద్విచక్ర వాహనదారులు తీవ్రంగా గాయపడే ప్రమాదం ఉందని తెలిపారు. గతంలో చైనా మంజా కారణంగా ప్రాణనష్టం కూడా సంభవించిన ఘటనలు ఉన్నాయని గుర్తు చేశారు. పండగల ఆనందం కోసం ఇతరుల కుటుంబాల్లో విషాదం నింపేలా ప్రవర్తించకూడదని ప్రజలకు సూచించారు. చైనా మంజా తయారీ, అమ్మకం, నిల్వ, వినియోగంలో పాల్గొంటే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను కూడా ఈ విషయంలో జాగ్రత్తగా పర్యవేక్షించాలని సూచించారు. ప్రజలు సహజమైన పత్తి దారంతో తయారైన మంజాను మాత్రమే వినియోగించి, సురక్షితంగా పండగలను జరుపుకోవాలని ఎస్‌ఐ ఆవుల తిరుపతి కోరారు. పోలీస్ శాఖకు సహకరించి, ఏమైనా చైనా మంజా విక్రయాల సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
.
Aksharam Telugu Daily