AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ ఆగష్టు 22 అక్షరం న్యూస్ ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచి పెద్దపల్లి గాయత్రి విద్యార్థులు మానవత్వాన్ని చాటుకున్నారు. ఇటీవల బసంత్‌నగర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పెద్దపల్లి మండలం చీకురాయికి చెందిన పినకాశి సతీష్ కుటుంబానికి రూ.32 వేల ఆర్థిక సాయం అందించారు. ప్రమాదంలో సతీష్ కుటుంబ పరిస్థితి విషమంగా ఉందని తెలుసుకున్న గాయత్రి విద్యాసంస్థల చైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ కుటుంబసభ్యులను పరామర్శించారు. సతీష్ భార్య, కుమారుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం గాయత్రి విద్యానికేతన్, గాయత్రి జూనియర్ కళాశాల, గాయత్రి డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థులు తమ వంతు సాయంగా సేకరించిన రూ.32 వేల విరాళాన్ని సతీష్‌కు అందజేశారు. ఆపదలో ఉన్న కుటుంబానికి విద్యార్థులు స్పందించి ఆర్థికంగా అండగా నిలవడం అభినందనీయమని అల్లెంకి శ్రీనివాస్ అన్నారు. ఆకుటుంబానికి అండగా దాతలు ముందుకు రావాలి.. సతీష్ కుటుంబం ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని అల్లెంకి శ్రీనివాస్ తెలిపారు. ప్రమాదం కారణంగా చికిత్సకు భారీగా ఖర్చవుతున్న నేపథ్యంలో దాతలు ముందుకు వచ్చి తమకు తోచినంత ఆర్థిక సహాయం అందించాలని కోరారు. బాధిత కుటుంబానికి అవసరమైన సహాయం అందించేందుకు మరింత మంది స్పందించాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులు తమ వంతుగా విరాళాలు సేకరించి కుటుంబానికి అందించడం ద్వారా మానవత్వాన్ని చాటారని పేర్కొన్నారు. ఆపదలో ఉన్న వారికి సహాయం చేయాలనే భావన విద్యార్థుల్లో పెంపొందించడం అవసరమన్నారు. సమాజంలో సేవా దృక్పథం పెరగడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు
.
Aksharam Telugu Daily