AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ మే 13 అక్షరం న్యూస్ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై వస్తున్న తాజా ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ టీపీపీసీ కమిటీ ప్రధాన కార్యదర్శి రాజేష్ కాశిపాక ఘాటుగా స్పందించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, బండి సంజయ్ అనుసరిస్తున్న ద్వంద్వ నీతిని ఎండగట్టారు. సొంత కుమారుడు బండి భగీరథ అకృత్యాలపై సమాధానం చెప్పలేక ప్రజల దృష్టిని మళ్లించేందుకు బండి సంజయ్ 'ధర్మం' ముసుగులో డ్రామాలు ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు. కరీంనగర్‌లో నిన్న జరిగిన హిందూ ఏక్తా యాత్రలో సంజయ్ చెప్పిన ప్రవచనాల్లో ఒక్కటైనా తన కుమారుడికి వర్తిస్తుందా? తన సొంత కుమారుడిని క్రమశిక్షణలో పెట్టలేని వ్యక్తి, సమాజాన్ని ఉద్ధరిస్తానంటే నవ్వొస్తోంది. రాజకీయాల్లో నీతి సూత్రాల గురించి మాట్లాడే ముందు కుమారుడిని అదుపులో పెట్టుకోవాలని అన్నారు. సంజయ్ కుమారుడిపై వస్తున్న ఆరోపణలను దమ్ముంటే బహిరంగంగా నిజాన్ని నిరూపించుకోవాలని రాజేష్ కాశిపాక నిలదీశారు. ఇతరుల మీద విమర్శలు చేసేటప్పుడు ధర్మం, న్యాయం గురించి మాట్లాడే బండి సంజయ్, ఇప్పుడు తన కుమారుడి విషయంలో వస్తున్న ఆరోపణలపై ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. తప్పు చేయలేదని నమ్మకం ఉంటే విచారణకు సహకరించి నిజాన్ని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తిగా కుటుంబ సభ్యుల ప్రవర్తనపై వస్తున్న ఫిర్యాదులకు తెలంగాణ సమాజానికి, కరీంనగర్ పార్లమెంటు ఓటర్లకు, ప్రజలకు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన భాధ్యత సంజయ్ పై ఉందని అన్నారు. అధికారంలో ఉన్నామన్న అహంకారంతో చట్టం నుండి తప్పించుకోవచ్చని భావిస్తే అది భ్రమే అవుతుందని అన్నారు. సామాన్యులకు ఒక న్యాయం కేంద్ర మంత్రి కుమారుడికి ఒక న్యాయం ఉండదని కాశిపాక స్పష్టం చేశారు. వేదికలెక్కి ధర్మం గురించి సంస్కారం గురించి నీతులు చెప్పే బండి సంజయ్ కి తన కుమారుడి వికృత చేష్టలు కనిపించడం లేదా? సంస్కారం లేకనే మీ కుమారుడు ఇలా రెచ్చిపోతున్నారా అని కాశిపాక నిలదీశారు. ఊరూరా ప్రవచనాలు చెప్పే ముందు తన ఇంట్లో జరుగుతున్న వాస్తవాలను గమనించాలని సూచించారు. ఎదుటివారిపై విమర్శలు చేసేటప్పుడు ప్రతిదానికి దమ్ము, ధైర్యం, మొగిడివైతే అని సవాళ్లు విసిరే బండి సంజయ్.. నీ కొడుకు చేసిన అరాచక పనులకు సమాధానం చెప్పలేక ప్రవచనాల వెనుక దాక్కుంటున్నావా అని అన్నారు. పక్కోడి ఇంట్లో చిన్నతప్పు జరిగితేనే చిందులేసే నువ్వు, మీఇంట్లో జరుగుతున్న అధర్మాన్ని చూసి ఎందుకు నోరు మెదపడం లేదని రాజేష్ కాశిపాక డిమాండ్ చేసారు. ధర్మం అంటే కేవలం రాజకీయాల కోసం యాత్రలు చేయడం కాదని, తప్పు చేసిన వారు తన కుమారుడైనా సరే ఖండించడమని పేర్కొన్నారు. కుమారుడి ఆగడాలను కప్పిపుచ్చుకుంటూ, బయట నీతులు చెప్పడం కేవలం రాజకీయ అవకాశవాదమే అని కాశిపాక ఎద్దేవా చేశారు. బండి సంజయ్ కి ధర్మంపై అంత చిత్తశుద్ధి ఉంటే, మొగిడివైతే, నీకు దమ్ము, ధైర్యం, ఉంటే ఇవాళ్ళ తెలంగాణ సమాజం ముందు మీ కుమారుడిని విచారణకు అప్పగించి నీ నిజాయితీని నిరూపించుకో అని కాశిపాక సవాలు విసిరారు. లేనిపక్షంలో ఈ వ్యవహారంపై బండి సంజయ్ తక్షణమే ప్రజలకు, బాధితులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని రాజేష్ కాశిపాక డిమాండ్ చేశారు. నీ కుమారుడు నిర్దోషి అయితే విచారణకు సిద్ధపడాలి. అంతేకానీ అధికారంతో నిజాన్ని నొక్కేయాలని చూస్తే తెలంగాణ సమాజం ఊరుకోదు. దమ్ముంటే నిజాన్ని నిరూపించుకో! అని కాశిపాక హెచ్చరించారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గేదే లేదని, బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడుతుందని రాజేష్ కాశిపాక ఈ సందర్భంగా తెలిపారు
.
Aksharam Telugu Daily