AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ సెప్టెంబర్ 06 అక్షరం న్యూస్ రాష్ట్రంలో ఎస్సీ,ఎస్టీ విద్యార్థుల అభ్యున్నతి కోసం అమలు చేస్తున్న బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ ఫీజు బకాయిలను ప్రభుత్వం తక్షణమే చెల్లించి,నిరుపేద దళిత విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపల్లి బాపయ్య,జిల్లా ఉపాధ్యక్షులు,సుద్దల మాజీ ఎంపీటీసీ సంకనపల్లి లక్ష్మయ్య,ఆదిజంబవ అరుంధతీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోటగిరి పాపయ్య డిమాండ్ చేశారు. ఆదివారం పెద్దపల్లి ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో దివంగత మర్రి చెన్నారెడ్డి హయాంలో ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఎంతోమంది దళిత విద్యార్థులు కార్పొరేట్ స్థాయి విద్యనభ్యసించి ఐఏఎస్,ఐపీఎస్, ఇంజనీర్లుగా ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారని గుర్తుచేశారు.ఈ పథకం కింద డే స్కాలర్ విద్యార్థులకు ఏటా రూ,28 వేలు,5వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యార్థులకు విద్య,హాస్టల్ సదుపాయాలతో కలిపి రూ.48 వేల చొప్పున ప్రభుత్వం చెల్లించాల్సి ఉందన్నారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోనూ సంవత్సరాలుగా ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు.ప్రభుత్వం నుండి బిల్లులు రాకపోవడంతో ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులు దళిత పిల్లలకు పుస్తకాలు, డ్రెస్సులు,బోధనా మెటీరియల్ ఇవ్వడం లేదని,కొన్నిచోట్ల తరగతుల నుండి బయటకు పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.తీవ్ర మనస్తాపానికి గురైన ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు ఇకపై తమ వల్ల కాదంటూ విద్యార్థులను పంపవద్దని జిల్లా కలెక్టర్‌తో పాటు ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు సమర్పించే దుస్థితి దాపురించిందని ధ్వజమెత్తారు.బడ్జెట్‌లో విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయించామని చెప్తున్న ప్రభుత్వం,ఎస్సీ సంక్షేమ శాఖకు చెందిన నిధుల నుండి బెస్ట్ అవైలబుల్ పథకానికి తక్షణమే బకాయిలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి అసెంబ్లీ వేదికగా లేదా ప్రత్యేక బడ్జెట్ ద్వారా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. రాబోయే 15 రోజుల్లోగా ఫీజు బకాయిలు చెల్లించకపోతే ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం,ఆదిజంబవ,అరుంధతీ సంఘాలు, దళిత ఐక్య వేదికల ఆధ్వర్యంలో దశలవారీగా పోరాటాలు చేపడతామని హెచ్చరించారు.మొదటి విడతగా చలో కలెక్టరేట్ ఆ తర్వాత చలో ధర్మపురి అనంతరం చలో ప్రజాభవన్ కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు
.
Aksharam Telugu Daily