D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ జూన్ 12 (అక్షరంన్యూస్) గత పదకొండు సంవత్సరాలలో తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పోషించిన పాత్ర అపూర్వమని, రాష్ట్రాన్ని ముందుకు నడిపిన ప్రతి ఘట్టానికీ కేంద్ర పథకాలే ఆధారం అన్న విషయాన్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందే బాబన్న , ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు స్పష్టంగా పేర్కొన్నారు. గురువారం ఖమ్మం లో మీడియాతో మాట్లాడిన వారు , కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అమలవుతున్న పథకాలు లక్షలాదిమందికి నేరుగా లబ్ధిని అందించాయని తెలిపారు. రాష్ట్రంలోని టీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనలో స్పష్టమైన అభివృద్ధి కనిపించలేదని విమర్శించారు. పీఎం కిసాన్ సన్మాన్ నిధి పథకం ద్వారా రాష్ట్రంలోని 31 లక్షల 30 వేల అర్హులైన రైతుల్లో 31 లక్షల 20 వేల మందికి నిధులు బదిలీ చేయబడినట్లు పేర్కొన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 99 శాతం నిధుల బదిలీ విజయవంతంగా జరిగిందన్నారు. ఇదే విధంగా, పీఎం ముద్రా యోజన ద్వారా 2017 నుంచి 2024 వరకు 75 లక్షల రుణ ఖాతాలు మంజూరై, 72 వేల కోట్ల విలువైన రుణాలు మంజూరు చేయబడ్డాయి. ఈ పథకాలు గ్రామీణ యువతలో స్వావలంబనకు బీజం వేశాయని అభిప్రాయపడ్డారు. పీఎం జనధన్ యోజన కింద రాష్ట్రంలో 1.27 కోట్ల లబ్ధిదారులకు రూ.517 కోట్ల నిధులు ఖాతాల్లో ఉన్నాయి. పీఎం స్వనిధి పథకం ద్వారా నాలుగు లక్షల మందికి 1247 కోట్లు మంజూరవగా, ఇందులో 1226 కోట్లు ఇప్పటికే విడుదలయ్యాయని వెల్లడించారు. పట్టణ గిరిజన, అణగారిన వర్గాల వాసులకు, వీధివిక్రేతలకు ఇది ఆశాజ్యోతి లాంటిదని కొనియాడారు. పీఎం ఆవాస్ యోజన (పట్టణం) ద్వారా ఇప్పటివరకు 3.6 లక్షల ఇళ్లకు మంజూరుతోపాటు, 2.4 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభమై 2.2 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. దీనికోసం కేంద్రం రూ.6150 కోట్లు మంజూరు చేసి, ఇప్పటివరకు 3800 కోట్లు విడుదల చేసినట్టు వివరించారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద 14331 కిలోమీటర్ల రహదారులకు మంజూరుగా 12,800 కిలోమీటర్లకు పైగా ఇప్పటికే నిర్మాణం పూర్తయ్యిందని తెలిపారు. అలాగే 551 వంతెనలలో 383 నిర్మాణం పూర్తయింది. ఈ పథకంపై కేంద్రం రూ.4948 కోట్లను వ్యయం చేసినట్టు తెలిపారు. ఆయుష్మాన్ భారత్-ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 82 లక్షల 59 వేల 718 ఆరోగ్య కార్డులు జారీ చేయబడ్డాయి. కేవలం గత 30 రోజుల్లోనే 6,268 కార్డులు మంజూరయ్యాయని పేర్కొన్నారు. అంతేకాక, జాతీయ రహదారుల విస్తరణలోనూ కేంద్రం తెలంగాణపై దృష్టిసారించిందని వివరించారు. 2019 నుండి 2025 వరకు రాష్ట్రంలో 1488 కిలోమీటర్ల జాతీయ రహదారులు నిర్మించబడి, వాటిపై మొత్తం 19,000 కోట్లకు పైగా వ్యయం జరిగినట్టు వివరించారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద మార్చి 2025 వరకు మొత్తం 11 లక్షల 84 వేల 203 గ్యాస్ కనెక్షన్లు మంజూరయ్యాయని తెలిపారు. గిరిజన, పేద మహిళలకు ఈ పథకం గృహోత్సాహాన్ని కలిగించిందని వ్యాఖ్యానించారు. ఇక, ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద, అంత్యోదయ అన్న పథకం ద్వారా రాష్ట్రంలో 5 లక్షల 67 వేల కుటుంబాలకు, మొత్తం 1.90 కోట్ల మందికి అన్నధాన పథకం ద్వారా నిత్యావసర సరుకులు అందించబడ్డాయి. నెల్లూరి కోటేశ్వరరావు పేర్కొన్న విధంగా, రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలన గడిచిన 10 ఏళ్లలోనూ, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలోనూ ప్రజలకు మేలు జరిగినట్లు కనిపించడంలేదని విమర్శించారు. అభివృద్ధి కేవలం కేంద్ర పథకాలతోనే సాధ్యమైందని, రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని సక్రమంగా అమలు చేయడంలో విఫలమయ్యాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నాయకులు గోంగూర వెంకటేశ్వరరావు, నున్న రవికుమార్, అల్లిక అంజయ్య, గంట్యాల విద్యాసాగర్, ఉప్పల శారద, వాకదాని పుల్లారావు, గుత్తా వెంకటేశ్వర్లు, అత్తి విజయ రెడ్డి, రవి రాథోడ్, తిరుమల పల్లి విజయరాజు, కోటమర్తి సుదర్శన్, గుగులోతు నాగేశ్వరరావు,భూక్య శ్యాంసుందర్, బోయినపల్లి చంద్రశేఖర్, ఈదుల వీరభద్రం హాజరయ్యారు.
.
Aksharam Telugu Daily