Sunday, 18 October 2026 04:29:59 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి తుమ్మల కీలక భేటీ..!

రైతు భూమికి భరోసా.. పంటకు రక్షణ సీతారామ కాలువలకు పైపులు.. ఆయిల్‌పామ్ తోటల్లో కవర్డ్ కండక్టర్లు.. సీఎం రేవంత్‌రెడ్డికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖలు 9,767 ఎకరాల భూమి ఆదా.. భూసేకరణ.. వ్యయంలో రూ.2,148.74 కోట్ల తగ్గింపునకు అవకాశం..


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 17 October 2026 08:58 PM Views : 169

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ అక్టోబర్ 17 (అక్షరం న్యూస్) హైదరాబాద్:రైతుల భూమిని కాపాడటం.. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ వ్యయాన్ని తగ్గించడం.. ఆయిల్‌పామ్ తోటల్లో విద్యుత్తు ప్రమాదాలను నివారించడం.. దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద గోదావరి జలాలను నిల్వ చేసుకోవడం.. ఖమ్మం నియోజకవర్గ అభివృద్ధి పనులకు నిధులు సాధించడం లక్ష్యంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పలు ప్రతిపాదనలు చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అక్టోబరు 16న రెండు వేర్వేరు లేఖలు అందజేశారు. సీతారామ ఎత్తిపోతల పథకం పంపిణీ కాలువలను సాంకేతికంగా సాధ్యమైన చోట పైపుల వ్యవస్థగా మార్చాలని ఒక లేఖలో కోరగా.. ఆయిల్‌పామ్ తోటల్లో విద్యుత్తు లైన్లను కవర్డ్ కండక్టర్లుగా మార్చేందుకు రాష్ట్రస్థాయి ఉమ్మడి విధానం రూపొందించాలని మరో లేఖలో ప్రతిపాదించారు. అలాగే, దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద ఇసుక బస్తాలతో నీటిని నిల్వ చేసేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని, ఖమ్మం నియోజకవర్గ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఆమోదించిన కాలువల వ్యవస్థతో పోలిస్తే పైపుల ద్వారా నీటిని పంపిణీ చేయడం వల్ల భూసేకరణ అవసరాన్ని గణనీయంగా తగ్గించవచ్చని మంత్రి వివరించారు. దీనివల్ల సుమారు 9,767 ఎకరాల భూమి ఆదా కావడంతో పాటు భూసేకరణ వ్యయంలో రూ.2,148.74 కోట్ల వరకు తగ్గింపు సాధ్యమవుతుందని అంచనా వేశారు. మరోవైపు ఆయిల్‌పామ్ తోటల్లో చెట్ల ఆకులు విద్యుత్తు తీగలకు తగలడం వల్ల ఏర్పడుతున్న సరఫరా అంతరాయాలు, ప్రమాదాలను నివారించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద నీటి నిల్వకు తక్షణ చర్యలు దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద గోదావరి జలాలను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ఇసుక బస్తాలతో తాత్కాలికంగా నీటిని నిల్వ చేసే ప్రతిపాదనను మంత్రి తుమ్మల ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆనకట్టపై సుమారు ఒక మీటరు నుంచి మీటరున్నర ఎత్తు వరకు ఇసుక బస్తాలను ఏర్పాటు చేయడం ద్వారా సుమారు ఒక టీఎంసీ నీటిని నిల్వ చేసే అవకాశం ఉందని వివరించారు. దీనివల్ల ప్రస్తుతం గోదావరిలో ప్రవహిస్తున్న నీటిని సాగు, తాగునీటి అవసరాలకు వినియోగించుకోవచ్చని, మూడు జిల్లాలకు తాగునీరు అందించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. సుమారు రూ.30 లక్షల వ్యయంతో ఇసుక బస్తాలను ఏర్పాటు చేయవచ్చని, బస్తాల స్థాయి వరకు నీరు చేరిన తర్వాత కూడా ప్రవాహం కొనసాగితే అదనపు నీరు వాటిపై నుంచి ప్రవహించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ ప్రతిపాదనపై ముఖ్యమంత్రికి వివరించగా, పనులను వెంటనే ప్రారంభించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఖమ్మంకు వరాలు కోరిన తుమ్మల ఖమ్మం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను మంజూరు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరారు. ముఖ్యంగా ఖమ్మం నగరంలో భూగర్భ డ్రైనేజీ, తాగునీటి పథకాలకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలను (డీపీఆర్‌) ఆమోదించి, అవసరమైన నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. డిసెంబరు 9న కల్లూరిగూడెం ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని, ఖమ్మంలో వెలుగుమట్ల హౌసింగ్ మోడల్ కాలనీని ప్రారంభించేందుకు రావాలని ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. ఖమ్మం నియోజకవర్గ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యలను త్వరగా పరిష్కరించి, అర్హులకు స్థలాలు అందజేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 6.74 లక్షల ఎకరాలకు సాగునీటి లక్ష్యం సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా పినపాక, కొత్తగూడెం, అశ్వారావుపేట, సత్తుపల్లి, వైరా, ఖమ్మం నియోజకవర్గాల్లో 3,28,853 ఎకరాలకు కొత్తగా సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మరో 3,45,534 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలని ప్రతిపాదించారు. మొత్తంగా 6,74,387 ఎకరాలకు ప్రయోజనం చేకూర్చే ఈ పథకంలో పంపిణీ కాలువల నిర్మాణానికి అవసరమయ్యే భూసేకరణ ప్రధాన సమస్యగా మారుతోందని తుమ్మల తన లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమోదించిన పంపిణీ కాలువల నిర్మాణానికి సుమారు 11,162 ఎకరాల భూమి అవసరమవుతుందని అంచనా. ఎకరాకు సగటున రూ.22 లక్షల చొప్పున లెక్కిస్తే భూసేకరణకే దాదాపు రూ.2,455 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆయిల్‌పామ్ వంటి అధిక పెట్టుబడి అవసరమయ్యే పంటలు సాగు చేస్తున్న రైతుల భూములను సేకరించడం మరింత కష్టంగా మారుతోందని వివరించారు. అటవీ ప్రాంతాల్లో అటవీ హక్కుల చట్టం (ఆర్వోఎఫ్ఆర్), పరిహార అడవుల పెంపకానికి సంబంధించిన నిబంధనలు కూడా సవాళ్లుగా ఉన్నాయని పేర్కొన్నారు. పైపుల వ్యవస్థతో భారీగా భూమి ఆదా తెరిచిన కాలువలు, గురుత్వాకర్షణ ఆధారిత కాలువల స్థానంలో సాంకేతికంగా అనుకూలమైన చోట పైపుల ద్వారా నీటిని సరఫరా చేసే వ్యవస్థను అమలు చేయాలని మంత్రి ప్రతిపాదించారు. ఈ విధానం ద్వారా భూమి అవసరాన్ని 11,162 ఎకరాల నుంచి 1,395 ఎకరాలకు తగ్గించవచ్చని అంచనా. ఫలితంగా సుమారు 9,767 ఎకరాల భూమి రైతులకు అందుబాటులో ఉండటంతో పాటు భూసేకరణ వ్యయంలో రూ.2,148.74 కోట్ల మేర ఆదా సాధ్యమవుతుందని వివరించారు. నీటిపారుదల శాఖ 157వ సాంకేతిక సలహా కమిటీ కూడా సాధ్యమైన ప్రాంతాల్లో పైపుల ఆధారిత పంపిణీ వ్యవస్థను చేపట్టాలని సూచించిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. భూసేకరణ అవసరం తగ్గితే రైతుల నుంచి అభ్యంతరాలు తగ్గడంతో పాటు భూముల సేకరణ ప్రక్రియ సులభతరమవుతుందని పేర్కొన్నారు. అటవీ భూములు, పరిహార అడవుల పెంపకానికి సంబంధించిన సమస్యలను కూడా కొంతవరకు అధిగమించవచ్చని తెలిపారు. నిర్మాణ వ్యయాల తగ్గింపునకూ అవకాశం పైపుల వ్యవస్థను అమలు చేయడం వల్ల భూసేకరణతో పాటు కాలువల నిర్మాణానికి సంబంధించిన పలు పనుల్లోనూ వ్యయాన్ని తగ్గించే అవకాశం ఉందని తుమ్మల పేర్కొన్నారు. ప్రస్తుత అంచనాల ప్రకారం మట్టి పనులకు రూ.413.59 కోట్లు, సీసీ లైనింగ్‌కు రూ.523.02 కోట్లు, క్రాస్‌ డ్రైనేజీ తదితర సీఎంఅండ్‌సీడీ పనులకు రూ.1,078 కోట్లు అవసరమవుతున్నాయని వివరించారు. ఈ నిర్మాణ విభాగాల్లో మార్పుల ద్వారా సుమారు రూ.1,807.82 కోట్ల వరకు ఆదా చేసే అవకాశం ఉందని ప్రతిపాదనలో పేర్కొన్నారు. పైపుల ద్వారా నీటిని సరఫరా చేస్తే నిర్మాణ పనులను వేగంగా పూర్తిచేయవచ్చని, ధరల పెరుగుదల కారణంగా ప్రాజెక్టు వ్యయం మరింత పెరగకుండా నియంత్రించవచ్చని మంత్రి అభిప్రాయపడ్డారు. నీటి వృథాను తగ్గించడంతో పాటు విద్యుత్తు వినియోగాన్ని కూడా ఆదా చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. సాగునీటి సరఫరా మరింత సమర్థంగా మారితే రైతులు వరి వంటి పంటలతో పాటు అధిక లాభాలు అందించే వాణిజ్య పంటల సాగువైపు మళ్లేందుకు ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు. ఆయిల్‌పామ్ తోటల్లో తీగలతో ఇబ్బందులు రాష్ట్రంలో అధిక విలువ కలిగిన ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించడంలో భాగంగా ప్రభుత్వం ఆయిల్‌పామ్ విస్తరణకు ప్రాధాన్యం ఇస్తోంది. అయితే, ఇప్పటికే ఆయిల్‌పామ్ సాగు చేస్తున్న రైతులతో పాటు కొత్తగా తోటలు ఏర్పాటు చేయాలనుకునేవారికి విద్యుత్తు లైన్లు సమస్యగా మారుతున్నాయని తుమ్మల ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆయిల్‌పామ్ చెట్లు ఎత్తుగా పెరిగిన తర్వాత వాటి ఆకులు, కొమ్మలు బేర్ కండక్టర్లను తాకుతున్నాయి. దీంతో తరచూ విద్యుత్తు లైన్లు ట్రిప్ అవుతున్నాయని, సంబంధిత ఫీడర్లపై ఆధారపడిన రైతుల పంపుసెట్లతో పాటు ఇతర వినియోగదారులకూ విద్యుత్తు సరఫరా నిలిచిపోతోందని వివరించారు. తీగలు తగలడం వల్ల విద్యుత్తు షాక్‌లు, అగ్నిప్రమాదాల ముప్పు ఏర్పడుతోందని, రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల భద్రతకు ప్రమాదం పొంచి ఉంటోందని పేర్కొన్నారు. చెట్ల కొమ్మలను తరచూ తొలగించాల్సి రావడంతో విద్యుత్తు పంపిణీ సంస్థలపై నిర్వహణ భారం, పునరావృత వ్యయం పెరుగుతున్నాయని తెలిపారు. ఈ సమస్యపై రైతుల నుంచి ఫిర్యాదులు ఎక్కువవుతున్నాయని, విద్యుత్తు లైన్ల సమస్య ఆయిల్‌పామ్ సాగు విస్తరణపైనా ప్రభావం చూపుతోందని వివరించారు. 11 కేవీ లైన్లకు కవర్డ్ కండక్టర్లు ఆయిల్‌పామ్ తోటల్లోని 11 కేవీ బేర్ కండక్టర్ల స్థానంలో కవర్డ్ కండక్టర్లు ఏర్పాటు చేయాలని తుమ్మల ప్రతిపాదించారు. అవసరమైన ప్రాంతాల్లో తక్కువ వోల్టేజీ (ఎల్‌టీ) లైన్లకు ఏరియల్ బంచ్‌డ్ కేబుళ్లు వినియోగించాలని సూచించారు. దీనివల్ల చెట్ల ఆకులు, కొమ్మలు తీగలను తాకడం వల్ల ఏర్పడే సమస్యలను తగ్గించడంతో పాటు విద్యుత్తు సరఫరా విశ్వసనీయతను మెరుగుపరచవచ్చని పేర్కొన్నారు. ఈ మార్పులను విడివిడిగా కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధానంతో చేపట్టాలని కోరారు. ఉద్యాన శాఖ, ఇంధన శాఖ, తెలంగాణ ఉత్తర విద్యుత్తు పంపిణీ సంస్థ (టీజీఎన్‌పీడీసీఎల్‌), తెలంగాణ దక్షిణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీజీఎస్‌పీడీసీఎల్‌) సమన్వయంతో పనిచేసేలా విధానం రూపొందించాలని సూచించారు. కొత్త తోటల అనుమతితోనే ప్రక్రియ ప్రారంభం కొత్తగా ఆయిల్‌పామ్ లేదా ఇతర తోటల సాగుకు అనుమతి ఇచ్చే సమయంలోనే సంబంధిత పొలంలో ఉన్న విద్యుత్తు లైన్ల మార్పిడి అవసరాన్ని గుర్తించాలని మంత్రి ప్రతిపాదించారు. ఉద్యాన శాఖ వెబ్‌ పోర్టల్‌ ద్వారా వివరాలను సంబంధిత డిస్కంకు పంపాలి. డిస్కం క్షేత్రస్థాయిలో పరిశీలించి, తోట పరిధిలోని అవసరమైన లైన్లకే పరిమితమై అంచనాలు సిద్ధం చేయాలి. ఇప్పటికే మంచి స్థితిలో ఉన్న విద్యుత్తు స్తంభాలు, ఇతర నిర్మాణాలను వినియోగించుకోవడం ద్వారా వ్యయాన్ని తగ్గించాలని సూచించారు. అంచనాలను అదే పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేసి, తోటకు మంజూరయ్యే బడ్జెట్‌లో లైన్ల మార్పిడి వ్యయాన్ని చేర్చాలని ప్రతిపాదించారు. ఈ విధానం అమలైతే కొత్తగా ఏర్పాటు చేసే తోటల్లోనే విద్యుత్తు లైన్ల మార్పిడి ప్రక్రియను ముందుగానే చేపట్టే అవకాశం ఉంటుంది. దీనివల్ల రైతులు తోటలు వేసిన తర్వాత ఎదుర్కొనే ఇబ్బందులను నివారించవచ్చని పేర్కొన్నారు. పాత తోటల్లో దశలవారీగా మార్పులు ఇప్పటికే సాగులో ఉన్న ఆయిల్‌పామ్ తోటల్లోనూ విద్యుత్తు లైన్ల సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తుమ్మల సూచించారు. ఉద్యాన శాఖ, విద్యుత్తు పంపిణీ సంస్థలు సంయుక్తంగా సర్వే నిర్వహించి, అవసరమైన మార్పులను గుర్తించాలి. అనంతరం వ్యయ అంచనాలను రూపొందించి, అనుమతుల కోసం పంపి, కాలపరిమితితో దశలవారీగా పనులు చేపట్టాలని ప్రతిపాదించారు. కొత్త తోటలకు అనుమతుల సమయంలోనే లైన్ల మార్పిడిని ప్రణాళికలో చేర్చడం, పాత తోటల్లో ప్రాధాన్య క్రమంలో పనులు చేపట్టడం ద్వారా సమస్యను క్రమబద్ధంగా పరిష్కరించవచ్చని వివరించారు. అనవసరమైన ఛార్జీలు లేకుండా, ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలను సాధ్యమైనంతవరకు వినియోగించుకుంటూ కనీస వ్యయంతో పనులు పూర్తిచేయాలని సూచించారు. రైతు సంక్షేమం.. ప్రజాధనానికి పొదుపు సీతారామ ప్రాజెక్టులో పైపుల ఆధారిత పంపిణీ వ్యవస్థ, ఆయిల్‌పామ్ తోటల్లో కవర్డ్ కండక్టర్ల ఏర్పాటు, దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద నీటి నిల్వ, ఖమ్మం నియోజకవర్గ అభివృద్ధి పనులు.. ఈ ప్రతిపాదనలన్నింటి వెనుక ప్రజాప్రయోజనాలే ప్రధానంగా ఉన్నాయని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. రైతుల భూమిని అనవసరంగా సేకరించాల్సిన పరిస్థితిని తగ్గించడం, సాగునీటి పనులను వేగవంతం చేయడం, విద్యుత్తు ప్రమాదాలను నివారించడం, అందుబాటులో ఉన్న జలాలను సమర్థంగా వినియోగించడం, ప్రభుత్వ నిధులను పొదుపు చేయడం లక్ష్యమని వివరించారు. ఈ ప్రతిపాదనలు అమలైతే సీతారామ ప్రాజెక్టులో భూసేకరణ సమస్యలు తగ్గడంతో పాటు సాగునీటి సరఫరా మెరుగుపడే అవకాశం ఉంటుంది. దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద నీటి నిల్వ ద్వారా మూడు జిల్లాల తాగునీటి అవసరాలకు ప్రయోజనం చేకూరవచ్చు. మరోవైపు ఆయిల్‌పామ్ సాగుదారులకు విద్యుత్తు సరఫరా అంతరాయాలు, ప్రమాదాల ముప్పు తగ్గడంతో పాటు ఖమ్మం నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి, జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.   యాతాలకుంట కుంట టన్నెల్ పనులు త్వరగా పూర్తి చేయాలి... యాతాలకుంట కుంట టన్నెల్ పనులను త్వరితగతిన పూర్తి చేసి సత్తుపల్లి, వేంసూరు, అశ్వారావుపేట, దమ్మపేట మండలాలకు సాగునీరు, తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల ముఖ్యమంత్రిని కోరారు. ఈ ప్రాంతాల రైతులకు సాగునీటి సదుపాయం కల్పించడంతో పాటు ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని వివరించారు. సీతమ్మసాగర్ అనుమతులు, జూలూరుపాడు టన్నెల్ పనులను వేగవంతం చేయాలి... సీతమ్మసాగర్ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులను త్వరితగతిన పొందేలా చర్యలు తీసుకుని, ప్రాజెక్టు పనులను ప్రారంభించాలని మంత్రి తుమ్మల కోరారు. అదేవిధంగా జూలూరుపాడు టన్నెల్ పనులను కూడా వీలైనంత త్వరగా ప్రారంభించి, సంబంధిత సాగునీటి ప్రాజెక్టుల పురోగతిని వేగవంతం చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :