AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : * పెద్దపల్లి సెప్టెంబర్ 22 అక్షరం ప్రతినిధి పెద్దపల్లి మండలంలోని మూలసాల గ్రామంలో పిడుగుపాటుకు 24 గొర్రెలు మృతి చెందిన ఘటన చాలా బాధాకరమని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు అన్నారు. మంగళవారం పెద్దపల్లి మండలం మూలసాల గ్రామంలో పిడుగుపాటుతో గొర్రెల మృతి చెందిన సంఘటన స్థలాన్ని స్థానిక నాయకులతో కలిసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ విజయరమణ రావు గారు మాట్లాడుతూ.. మూలసాల గ్రామానికి చెందిన బోయిని సదయ్య, కాసు నరేష్‌లకు చెందిన గొర్రెలను అన్నయ్యకుంట చెరువు సమీపంలో మేపుతుండగా అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం సమయంలో ఒక్కసారిగా పిడుగు పడటంతో మందలోని 24 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయని ఈ సంఘటన చాలా బాధాకరమని అన్నారు. అకాలంగా సంభవించిన ఈ ఘటనతో గొర్రెల కాపరులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారని తమ కళ్ల ముందే గొర్రెలు మృత్యువాత పడటంతో సదయ్య, నరేష్ కన్నీరుమున్నీరుగా విలపించడం శోచనీయమని గొర్రెల పెంపకమే తమ జీవనాధారమని, ఒక్కసారిగా ఇంత పెద్ద సంఖ్యలో గొర్రెలు మృతి చెందడంతో నష్టపోయారని వారికి ప్రభుత్వం తరుపున ఆదుకుంటామని తెలిపారు. సంఘటన స్థలం నుండే జిల్లా కలెక్టర్ కి ఫోన్ కాల్ ద్వారా మాట్లాడటం జరిగిందని కలెక్టర్ కి మృతి చెందిన గొర్రెలను నమోదు చేసి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మూలసాల గ్రామస్థులు, పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్, సింగిల్ విండో చైర్మన్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily