INDOORI THIRUPATHI, MANCHIRYAL .Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మంచిర్యాల జిల్లా : * * మంచిర్యాల జిల్లా /తాండూరు /ఫిబ్రవరి 14/అక్షరం న్యూస్ - ప్రభుత్వ బియ్యం పక్కదారి పడుతున్నాయా? నిబంధనలకు విరుద్ధంగా మిల్లు యజమానులు అక్రమ దందాకు తెరలేపారా? మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో తాజాగా వెలుగు చూసిన ఘటన చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కార్తికేయ ఇండస్ట్రీస్ (Karthikeya Industries) మిల్లు నుండి రాత్రికి రాత్రే ఆంధ్రప్రదేశ్‌కు తరలుతున్న బియ్యం లారీని స్థానిక లారీ అసోసియేషన్ సభ్యులు పట్టుకోవడం ఇప్పుడు జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. *లారీ అసోసియేషన్ సభ్యుల కథనం ప్రకారం:* ఐబీ తాండూరు లారీ అసోసియేషన్ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం పట్టపగలే ఆంధ్రాకు చెందిన లారీలో బియ్యం లోడింగ్ చేసి, రాత్రికి రాత్రే కాకినాడ పోర్టుకు తరలించేందుకు ప్రయత్నించారు. స్థానిక అసోసియేషన్ లారీలను కాదని, వేరే రాష్ట్రానికి చెందిన వాహనాన్ని ఉపయోగించడంతో అనుమానం వచ్చిన సభ్యులు, లారీని అడ్డుకుని నిలదీశారు. వే-బిల్లులు లేకుండా టన్నుల కొద్దీ బియ్యం తరలిస్తున్న ఈ అక్రమ దందా అసోసియేషన్ సభ్యుల చొరవతోనే వెలుగులోకి వచ్చింది. పట్టుబడిన వాహనం ప్రస్తుతం అసోసియేషన్ కార్యాలయ ఆవరణలోనే ఉన్నా, అటు మిల్లు యజమాని గానీ, ఇటు లారీ ఓనర్ గానీ అక్కడకు రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని సభ్యులు పేర్కొంటున్నారు. *అధికారులను నిలదీస్తున్న ప్రశ్నలివే:* వే-బిల్లులు ఎక్కడ?: టన్నుల కొద్దీ బియ్యం సరిహద్దులు దాటుతున్నా, కనీసం వే-బిల్లులు లేకపోవడం అధికారుల కళ్లకు కనిపించడం లేదా? మూవ్‌మెంట్ ఆర్డర్ ఉందా?: ప్రభుత్వం కేటాయించిన సీఎంఆర్ ధాన్యం లేదా బియ్యం తరలించడానికి సివిల్ సప్లై శాఖ నుండి ఖచ్చితంగా ఉండాల్సిన 'మూవ్‌మెంట్ ఆర్డర్' ఈ లారీకి ఉందా? రంగు సంచుల మాయాజాలం: ప్రభుత్వ బియ్యం అయితే ఖచ్చితంగా మార్కింగ్ ఉన్న గోనె సంచుల్లో ఉండాలి. కానీ, యూరియా మరియు ఇతర ఎరువుల సంచుల్లో బియ్యాన్ని ఎందుకు నింపారు? ఇది అధికారుల కళ్లు గప్పడానికి చేస్తున్న ప్రయత్నం కాదా? ఆరోగ్యంతో చెలగాటం: రసాయన ఎరువులు నింపిన సంచులను ఆహార గింజల నిల్వకు వాడకూడదనే నిబంధన ఉన్నా, రంగు సంచుల్లో బియ్యం నింపడం 'ఫుడ్ సేఫ్టీ' చట్టాల ఉల్లంఘన కాదా? *ఆరోపణల మునకలో మిల్లు యజమాన్యం:* కార్తికేయ ఇండస్ట్రీస్ యాజమాన్యం ప్రభుత్వం ఇచ్చిన సీఎంఆర్ ధాన్యాన్ని పక్కదారి పట్టించిందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఏపీకి చెందిన AP07TH7395 నంబర్ గల లారీని ఉపయోగిస్తూ, లోపల ఉన్నది ప్రభుత్వ ధాన్యమా లేక పేదలకు అందాల్సిన రేషన్ బియ్యమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నూతనంగా ఏర్పాటైన ఈ మిల్లుకు ప్రభుత్వం కేటాయించిన సీఎంఆర్ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ప్రభుత్వానికి పెట్టకుండా, ఇతర రాష్ట్రాలకు తరలించి అమ్ముకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. *విచారణ జరిగితేనే అసలు బండారం బయటపడుతుంది!* కేవలం ఒక్క లారీతోనే ఈ దందా ఆగిందా? లేక గత కొద్ది రోజులుగా ఈ "రంగు సంచుల" అక్రమ రవాణా కొనసాగుతోందా? అన్నది తేలాల్సి ఉంది. మిల్లులోని విద్యుత్ వినియోగం, స్టాక్ రిజిస్టర్లు, మరియు ఏపీ నుండి వచ్చిన ధాన్యం బిల్లులను క్షుణ్ణంగా పరిశీలిస్తే పెద్ద కుంభకోణమే బయటపడే అవకాశం ఉంది. జిల్లా కలెక్టర్ మరియు విజిలెన్స్ అధికారులు తక్షణమే స్పందించి, మిల్లు యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
.
Aksharam Telugu Daily