D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ వైరా టౌన్ అక్టోబర్ 30 (అక్షరం న్యూస్) వైరా మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రంలో అధికారుల అలసత్వం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామంటూ పెసల రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మార్క్‌ఫెడ్ పెసల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి నెల రోజులు కావస్తున్నా, అధికారులు ఇప్పటివరకు పెసల కొనుగోలు చేపటకపోవడంపై స్థానిక రైతులు మండిపడుతున్నారు. ఇదే విషయమై మార్క్‌ఫెడ్ అధికారులను రైతులు నిలదీయగా, తాము వారం క్రితం పంపించిన లారీలల్లో నాణ్యత లోపించిందనే నెపంతో ఖమ్మం సీసీఐ గోడౌన్ అధికారులు వాటిని వెనక్కి పంపించారని వెల్లడించారు. అంతేకాకుండా, "ఖమ్మం గోడౌన్‌కు ఇప్పటికే పంపించిన పెసలను అక్కడ అన్ లోడ్ చేసుకుంటేనే ఇక్కడ మీ దగ్గర నుంచి కొత్తగా కొనుగోలు చేస్తాం, లేదంటే మేమేమీ చేయలేం" అంటూ బాధ్యతారాహిత్యంగా, దిక్కుతోచని రీతిలో సమాధానం ఇస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. నెల రోజులుగా కొనుగోలు కేంద్రం చుట్టూ తిరుగుతున్నా అధికారుల నుంచి సరైన స్పందన లేక, ధాన్యం దిగుమతి కాక తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు వాపోతున్నారు. కావున, సంబంధిత ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ఖమ్మం గోడౌన్ సమస్యను పరిష్కరించి, వైరా మార్క్‌ఫెడ్ కేంద్రంలో పెసల కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలని రైతాంగం డిమాండ్ చేశారు.
.
Aksharam Telugu Daily