AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/ ములకలపల్లి /సెప్టెంబర్ 1 /అక్షరం న్యూస్: హైదరాబాద్‌లో దారుణ హత్యకు గురైన మండల పరిధిలోని చౌటిగూడెం గ్రామానికి చెందిన ఊకే శిరీష కుటుంబాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మంగళవారం పరామర్శించారు. వారి నివాసానికి చేరుకుని, తీవ్ర విషాదంలో ఉన్న కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. శిరీష మృతి ఆ కుటుంబానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షలు, మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా రూ. 1 లక్ష, ఐటీడీఏ నుంచి రూ. 30 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ప్రకటించారు. వీటికితోడు ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి తాము వ్యక్తిగతంగా మరో రూ. 1 లక్ష ఆర్థిక సాయం అందజేస్తున్నామని, మొత్తంగా రూ. 7.30 లక్షల సాయం అందుతుందని తెలిపారు. అలాగే ఆ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడంతో పాటు వారి జీవనోపాధి కోసం భూమి కేటాయించే అంశాన్ని కూడా పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. శిరీష కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, కాంగ్రెస్ నాయకులు బత్తుల అంజి, జహీరుద్దీన్, సర్పంచ్ వినోద్, ఆదివాసీ నాయకుడు ఊకే రవి తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily