AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ జూన్ 02 అక్షరం న్యూస్ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం పెద్దపల్లి పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి వేడుకల్లో భాగంగా ఉదయం పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్షతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు తెలంగాణ ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు ఈ సందర్భంగా సమీకృత కలెక్టరేట్ ఆవరణలోని తెలంగాణ తల్లి విగ్రహానికి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్షతో కలిసి పూలమాలలు సమర్పించారు పోలీసు కవాతు నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ప్రజలనుద్దేశించి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రస్తుతం 200 బిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉన్న తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి ఒక ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు, 2047 నాటికి మూడు ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు పెంచే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రాష్ట్రంలోని కోటి 15 లక్షల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున జీవిత బీమా రక్షణ కల్పించే “ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా” పథకాన్ని జూన్ 2 నుంచి అమలు చేస్తున్నామని తెలిపారు. కుటుంబ పోషకుడు మరణించిన సందర్భంలో కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు పరిశుభ్రత, ఆరోగ్యం, విద్య, రైతు సంక్షేమం, మహిళా సాధికారత, యువజనాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యారంగంలో ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు నూతనంగా అల్పాహార పథకాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరించామని చెప్పారు. జిల్లాలోని 547 పాఠశాలల ద్వారా సుమారు 37 వేల మంది విద్యార్థులకు విద్య అందుతోందని, ఎఫ్.ఆర్.ఎస్ విధానంలో 96 శాతం హాజరు నమోదవుతోందన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా రూ.17 కోట్లతో మౌలిక వసతులు కల్పించామని, రూ.66 లక్షలతో భవిత కేంద్రాలను అభివృద్ధి చేశామని, పీఎం శ్రీ పథకం కింద ఎంపికైన 16 పాఠశాలలను ఆధునికీకరిస్తున్నామని తెలిపారు. అభయహస్తం కార్యక్రమం కింద జిల్లాలో 9,823 కొత్త తెల్ల రేషన్ కార్డులు జారీ చేయడంతో పాటు 8,978 మంది కొత్త సభ్యులను పాత కార్డుల్లో చేర్చామని తెలిపారు. మహాలక్ష్మి పథకం కింద జిల్లాలో 1,18,953 మంది లబ్ధిదారులకు 4,73,691 గ్యాస్ సిలిండర్లను రూ.14.03 కోట్ల సబ్సిడీతో రూ.500కే అందించామని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా జిల్లాలో మహిళలు రూ.193.35 కోట్ల మేర ఆదా చేసుకున్నారని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం మొదటి విడతలో జిల్లాకు మంజూరైన 6,451 ఇళ్ల నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయని, లబ్ధిదారుల ఖాతాల్లో ఇప్పటివరకు రూ.126 కోట్లు జమ చేశామని తెలిపారు. రెండో విడతలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 2 వేల చొప్పున మొత్తం 6 వేల ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగిస్తున్న 1,39,760 కుటుంబాలకు రూ.135.92 కోట్ల సబ్సిడీతో ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. మహిళా శక్తి మిషన్ కింద జిల్లాలోని 6,851 స్వయం సహాయక సంఘాలకు రూ.454.66 కోట్ల బ్యాంక్ లింకేజ్ రుణాలు, 1,642 సంఘాలకు రూ.52.90 కోట్ల స్త్రీనిధి రుణాలు అందించామని చెప్పారు. 8,909 సంఘాలకు రూ.18.03 కోట్ల వడ్డీ రాయితీ విడుదల చేశామని తెలిపారు. మహిళా సంఘాల ద్వారా 15 అద్దె ఆర్టీసీ బస్సులు, ఒక మెగావాట్ సోలార్ ప్లాంట్, ఒక పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో 5,668 మహిళా ఎంటర్‌ప్రైజ్‌లు స్థాపించబడ్డాయని పేర్కొన్నారు. రంగంపల్లి వీ-హబ్ కేంద్రం ద్వారా 376 మందికి శిక్షణ అందించామని తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 93,659 మంది లబ్ధిదారులకు రూ.252.22 కోట్ల చేయూత పింఛన్లు అందించామని తెలిపారు. నరేగా కింద రూ.18.21 కోట్ల వ్యయంతో 30,659 కుటుంబాలకు ఉపాధి కల్పించామని చెప్పారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద 456 మంది రైతులకు రూ.1.92 కోట్ల సబ్సిడీతో వ్యవసాయ పరికరాలు పంపిణీ చేశామని తెలిపారు. రైతు భరోసా కింద 1,54,598 మంది రైతులకు రూ.114.04 కోట్ల నిధులు జమ చేశామని చెప్పారు. 50 శాతం సబ్సిడీపై 6,900 క్వింటాళ్ల పచ్చిరొట్టె విత్తనాలు పంపిణీ చేశామని తెలిపారు. రైతు బీమా కింద గత రెండు సంవత్సరాల్లో మరణించిన 1,002 మంది రైతు కుటుంబాలకు రూ.44.85 కోట్ల పరిహారం అందించామని పేర్కొన్నారు. 2025-26 యాసంగి సీజన్‌లో 334 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రూ.767.09 కోట్ల విలువైన 3,23,773 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి మద్దతు ధరను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. ఉద్యానవన శాఖ ద్వారా 3,472 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు విస్తరణ చేపట్టి రూ.1.78 కోట్ల సబ్సిడీ అందించామని, సూక్ష్మ నీటి సేద్య పథకం కింద 1,162 ఎకరాలకు రూ.3.19 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. విద్యుత్ శాఖ ద్వారా జిల్లాలోని 74,157 వ్యవసాయ కనెక్షన్లకు రూ.382.65 కోట్ల సబ్సిడీతో 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. పీఎం కుసుమ్ పథకం కింద 9.5 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చుకున్నామని చెప్పారు. పీఎం సూర్యఘర్ పథకం కింద 1,094 సోలార్ రూఫ్‌టాప్‌లను 7.287 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లాలో 9 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. నందిమేడారం గ్రామాన్ని మోడల్ సోలార్ గ్రామంగా అభివృద్ధి చేస్తూ రూ.51.28 కోట్లతో 1,486 గృహాలు, 628 వ్యవసాయ పంపుసెట్లకు సోలార్ వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా జిల్లాలో రూ.39 కోట్ల 11 లక్షల వ్యయంతో 14,983 మందికి ఉచిత శస్త్రచికిత్సలు నిర్వహించగా, తెలంగాణ హబ్ డయాగ్నోస్టిక్స్ ద్వారా 95,624 మంది నుంచి 1,72,159 శాంపిల్స్ సేకరించి 3,39,906 పరీక్షలు ఉచితంగా నిర్వహించామని, 108 అంబులెన్స్ ద్వారా 13,937 మందికి, 102 సేవల ద్వారా 16,924 మంది గర్భిణులు, చిన్నారులకు రవాణా సౌకర్యం కల్పించారు. రామగుండం క్రిటికల్ కేర్ భవనం, మేడారం సీహెచ్‌సీ లను ప్రారంభించగా, రూ.51 కోట్లతో జిల్లా ఆసుపత్రి, రూ.26 కోట్లతో నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. రోడ్లు, భవనాల అభివృద్ధికి ప్రభుత్వం భారీ స్థాయిలో నిధులు కేటాయించిందని, జిల్లాలో 102.06 కిలో మీటర్ల మేర 22 డబుల్ రోడ్డు విస్తరణకు రూ.921.93 కోట్లు మంజూరు చేయగా పనులు పురోగతిలో ఉన్నాయని అన్నారు. రూ.497.03 కోట్లతో 17 వంతెనల నిర్మాణం, విస్తరణ పనులు చేపట్టగా 9 పూర్తయ్యాయని, వరదలతో దెబ్బతిన్న రహదారులను రూ.31.81 కోట్లతో పునరుద్ధరణ పనులు చేపట్టి 16 పనులు పూర్తి చేశామని అన్నారు. పెద్దపల్లి–కాల్వ శ్రీరాంపూర్ మార్గంలో రూ.119 కోట్లతో నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు 75 శాతం పూర్తయ్యాయని, అలాగే రూ.160.30 కోట్లతో రామగుండం ఆసుపత్రి భవనం, రూ.104.81 కోట్లతో కోర్ట్ , ఇతర భవనాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు పట్టణాభివృద్ధి రంగంలో ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా మౌలిక సదుపాయాల విస్తరణ చేపడుతోందని, అమృత్-2.0 పథకం కింద జిల్లాలో రూ.289.46 కోట్లతో ఎస్‌టీపీలు, సీవర్ ట్రంక్ మెయిన్‌ల, యూఐడీఎఫ్ నిధుల ద్వారా రూ.226 కోట్లతో మంచినీటి సరఫరా, రోడ్లు, డ్రైన్లు, వీధి దీపాలు, సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. డీఎంఎఫ్‌టీ నిధులు రూ.67.59 కోట్ల వ్యయంతో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, భూగర్భ మురుగు కాలువలు, మంచినీటి పైప్‌లైన్ పనులు అమలులో ఉన్నాయి. మెప్మా ఆధ్వర్యంలో 714 సంఘాలకు రూ.96.52 కోట్ల బ్యాంక్ లింకేజ్ రుణాలు, 34,707 మంది వీధి వ్యాపారులకు రూ.68.32 కోట్ల పీఎం స్వనిధి రుణాలు, 994 సంఘాలకు రూ.21.11 కోట్ల స్త్రీనిధి ఆర్థిక సహాయం అందించామని అన్నారు. మత్స్య శాఖ ద్వారా 26,051 హెక్టార్లలో కోటి 58 లక్షల చేప పిల్లల విడుదలకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని తెలిపారు. ప్రమాదాల్లో మరణించిన 23 మత్స్యకార కుటుంబాలకు రూ.1.15 కోట్ల పరిహారం అందించామని చెప్పారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ద్వారా 706 అంగన్‌వాడీ కేంద్రాల్లో 3,710 మంది గర్భిణీలు, 2,930 మంది బాలింతలు, 33,441 మంది చిన్నారులకు పోషకాహారం అందిస్తున్నామని తెలిపారు. 153 మంది దివ్యాంగులకు పరికరాలు, 21 మందికి స్వయం ఉపాధి రుణాలు, 9 దివ్యాంగ జంటలకు వివాహ ప్రోత్సాహకాలు అందించామని పేర్కొన్నారు. యువజన, క్రీడా రంగంలో రూ.2.50 కోట్లతో ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్టు, రూ.1.50 కోట్లతో స్విమ్మింగ్ పూల్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.పారిశ్రామిక రంగంలో 266 మందికి ఉపాధి కల్పించే 22 పరిశ్రమలకు రూ.11.24 కోట్ల పెట్టుబడులతో టీజీ-ఐపాస్ అనుమతులు మంజూరు చేశామని, పీఎంఈజీపీ కింద 29 యూనిట్లు, టీ-ఐడియా, టీ-ప్రైడ్ ద్వారా 42 పరిశ్రమలకు రూ.7.67 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. ఉపాధి కల్పనలో భాగంగా నిర్వహించిన మెగా జాబ్‌మేళాలో 3,515 మంది యువత పాల్గొనగా 933 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయని తెలిపారు. అగ్నివీర్ శిక్షణ ద్వారా 47 మంది ఎంపికైనట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే. అరుణ శ్రీ, డిసిపి రాంరెడ్డి, డిఆర్ఓ రాజేశ్వరి, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, రామగుండం మేయర్ మహంకాళి స్వామి, పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్, నూగిళ్ల మల్లయ్య ,ఆర్డీఓ బి. గంగయ్య, కలెక్టరేట్ ఏఓ ప్రకాష్, జిల్లా అధికారులు,మార్కెట్ చైర్మన్ లు, డైరెక్టర్లు, కౌన్సిలర్లు, సర్పంచ్ లు మరియు ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily