GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మంచిర్యాల జిల్లా : * • మంచిర్యాల జిల్లా /బెల్లంపల్లి / ఫిబ్రవరి 7 /అక్షరం న్యూస్ బెల్లంపల్లి పట్టణంలోని సమీకృత బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ కు గురై అస్వస్థతతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి పరామర్శించారు.సుమారు 20 మంది బాలికలు అస్వస్థతకు గురైన విషయం తెలియగానే ఆయన హుటాహుటిన ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికల ఆరోగ్య పరిస్థితిని ఎమ్మెల్యే వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అత్యుత్తమ వైద్యం అందించాలని, చికిత్సలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షించాలని వైద్యులను ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని వివరించారు. ఈ ఘటనపై తక్షణ చర్యలు తీసుకోవాలని, అధికారులను అప్రమత్తం చేయాలని కలెక్టర్‌ను కోరారు. సబ్ కలెక్టర్ మనోజ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని బాలికల ఆరోగ్య స్థితిగతులను పరిశీలించారు. *వసతి గృహంలో ఆకస్మిక తనిఖీ:* ఆస్పత్రి సందర్శన అనంతరం ఎమ్మెల్యే నేరుగా సమీకృత బాలికల వసతి గృహానికి వెళ్లారు. అక్కడి వంటశాల, భోజన తయారీ విధానం, ఆహార నాణ్యత మరియు పరిశుభ్రతను స్వయంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "బాలికల ఆరోగ్య భద్రత విషయంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడదు. వసతి గృహాల్లో ఆహార నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి" అని స్పష్టం చేశారు. ఈ ఘటనకు కారణమైన అంశాలపై పూర్తిస్థాయి విచారణ జరిపి, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, రెవెన్యూ అధికారులు మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily