DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : దొమ్మటి రాజేష్, పెద్దపల్లి; తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి 2026 సంవత్సరానికి గాను ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ఈ మేరకు తెలంగాణ గజిట్ ఎక్స్‌ట్రార్డినరీలో అధికారికంగా నోటిఫికేషన్ జారీ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా పట్టణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇదే అధికారిక ఎన్నికల షెడ్యూల్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ జనవరి 28, 2026 (బుధవారం) నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం (ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు) జనవరి 30, 2026 (శుక్రవారం) నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ జనవరి 31, 2026 (శనివారం) నామినేషన్ల పరిశీలన ఫిబ్రవరి 1, 2026 (ఆదివారం) తిరస్కరణపై అప్పీళ్లకు గడువు ఫిబ్రవరి 2, 2026 (సోమవారం) అప్పీళ్ల పరిష్కారం ఫిబ్రవరి 3, 2026 (మంగళవారం) అభ్యర్థిత్వ ఉపసంహరణకు చివరి తేదీ ఫిబ్రవరి 11, 2026 (బుధవారం) పోలింగ్ (ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు) ఫిబ్రవరి 13, 2026 (శుక్రవారం) ఓట్ల లెక్కింపు ఓట్ల లెక్కింపు పూర్తైన వెంటనే ఫలితాల ప్రకటన పెద్దపల్లి జిల్లాలో వేడెక్కిన మున్సిపల్ రాజకీయం ఈ ఎన్నికల్లో పెద్దపల్లి జిల్లాకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. జిల్లాలోని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, అలాగే పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. రిజర్వేషన్ల ప్రకారం రామగుండం కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఎస్సీ జనరల్‌కు, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సిపాలిటీల చైర్మన్ పదవులను బీసీలకు కేటాయించడంతో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. షెడ్యూల్ విడుదలతో ఆశావహుల హడావుడి ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో పెద్దపల్లి జిల్లా పట్టణాల్లో ఆశావహులు ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారు. టికెట్ కోసం ఎమ్మెల్యేలు, మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు పెరిగాయి. ఇప్పటికే ఒకే వార్డు నుంచి ఇద్దరు, ముగ్గురు పోటీ పడుతుండటంతో గెలుపు గుర్రాలు ఎవరు అనే అంశంపై అధికార పార్టీ సర్వేలు ముమ్మరం చేసింది. కాంగ్రెస్ ముందస్తు వ్యూహాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టణ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ముందుగానే జిల్లాకు ఒక మంత్రి చొప్పున బాధ్యతలు అప్పగించారు. పట్టణాలకు భారీ నిధులు కేటాయించడంతో పాటు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు కూడా పూర్తిచేశారు. కొన్నిచోట్ల కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్, కార్పొరేషన్ అభ్యర్థులను ముందే ప్రకటించి రాజకీయంగా పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తోంది. ప్రతిపక్షాలకు సవాల్ మరోవైపు టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ ఈ ఎన్నికల్లో కొంత వెనుకంజలో ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో పార్టీ వ్యూహాలను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అంటున్నారు. అధికార పార్టీ పై విమర్శలకే పరిమితమైన టిఆర్ఎస్ పార్టీ నాయకులు సంస్థ గతంగా పార్టీని బలోపేతం చేయడంలో శ్రద్ధ తీసుకోవడం లేదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జాతీయ పార్టీ అయిన బీజేపీ కూడా తమ పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, స్థానికంగా బలమైన అభ్యర్థుల కొరత ఎదురవుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కవిత నిర్ణయం… కొత్త రాజకీయ సమీకరణాలు బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మున్సిపల్ పోరులో నిలవాలని నిర్ణయించడంతో పెద్దపల్లి జిల్లా రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. పార్టీ ఇంకా ఏర్పాటు కాలేకపోయినా ‘సింహం’ గుర్తుతో తమ అనుచరులను మున్సిపల్ బరిలో నిలబెట్టే దిశగా ఆమె అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా కొలిపాక శ్రీనివాసును ప్రకటించి కవిత ముందంజలో ఉన్నారు. రసవత్తరంగా మారనున్న పెద్దపల్లి పట్టణ పోరు ఈ అన్ని పరిణామాలతో పెద్దపల్లి జిల్లాలో జరగనున్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు హోరాహోరీగా సాగనున్నాయి. అధికార పార్టీ దూకుడు, ప్రతిపక్షాల వ్యూహాలు, కొత్త రాజకీయ శక్తుల ప్రవేశం… చివరికి పట్టణ ఓటరు తీర్పు ఎవరి వైపు నిలుస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
.
Aksharam Telugu Daily