OMKARI SRINIVAS, JAGITYAL. Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / జగిత్యాల : జగిత్యాల/జనవరి 30/అక్షరం న్యూస్: ఇది ఏ ఒక్క తల్లి మాట కాదు. మున్సిపల్ ఎన్నికల వేళ వందల కుటుంబాల్లో వినిపిస్తున్న నిస్సహాయ స్వరం. మున్సిపల్ ఎన్నికలు ప్రజాస్వామ్య పండుగగా ఉండాల్సినవి. కానీ అవి నెమ్మదిగా అప్పుల పండుగగా మారుతున్నాయి. గెలుపు కోసం జరుగుతున్న ఖర్చు సామాన్య కుటుంబాల్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తోంది. నామినేషన్ దాఖలుతోనే ఖర్చులు మొదలవుతాయి. ప్రచారం పేరుతో బ్యానర్లు, ఫ్లెక్సీలు, వాహనాలు, భోజనాలు, సమావేశాలు… ఒక్కో వార్డులో లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయి. పైగా పార్టీ ఒత్తిళ్లు, పోటీ అభ్యర్థుల ఆర్భాటం చూసి “మనమూ అంతే చేయాలి” అనే భావన అభ్యర్థుల్లో పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో సామాన్య కుటుంబాల నుంచి పోటీ చేసే అభ్యర్థులు అప్పులు చేసి రాజకీయాల్లోకి దిగుతున్నారు. గెలిచినా అప్పుల ఊబిలో నుంచి బయటపడటం కష్టమే. ఓడిపోతే పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. కుటుంబాల్లో కలహాలు, ఆర్థిక ఒత్తిడులు, మానసిక వేదనలు పెరుగుతున్నాయి. అందుకే ఓ తల్లి గుండె పగిలేలా చెబుతోంది – “పోటీ చేయొద్దు నాయనా… అప్పులపాలు అవ్వద్దు…” ప్రజాసేవ చేయాలనే ఆశ గొప్పదే. కానీ ప్రజాసేవ పేరు మీద కుటుంబాలను అప్పుల చెరలోకి నెట్టడం ఎంతవరకు సమంజసం? ఎన్నికల్లో ఖర్చు పరిమితులు కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డబ్బు కాదు, అభ్యర్థి ఆలోచన, సేవా తత్వం ముఖ్యమయ్యే వ్యవస్థ రావాలి. లేదంటే మున్సిపల్ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పండుగగా కాక, తల్లుల కన్నీళ్లకు కారణంగా మారే ప్రమాదం ఉంది.
.
Aksharam Telugu Daily