DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : దొమ్మటి రాజేష్ పెద్దపల్లి ప్రతినిధి; పోలింగ్ తేదీ సమీపిస్తుండడంతో పెద్దపల్లి మున్సిపల్ ఎన్నికల ప్రచారం రోజురోజుకు ఉధృతంగా సాగుతోంది. పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో 36 వార్డులు ఉండగా, కాంగ్రెస్, బిఆర్ఎస్ బిజెపి, ఐఎఫ్బి, సిపిఐ, ఎంఐఎం , జనసేన తదితర పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రంగా కూడా కొంతమంది ఎన్నికల బరిలో నిలిచారు. పార్టీలు, వార్డుల వారీగా అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అయితే ప్రచారం చేసుకోవడం కంటే ప్రచారానికి జనాలను సమీకరించడమే అభ్యర్థులకు పెద్ద తలనొప్పిగా మారింది. “ఈరోజు వీలు కాదు.. రేపు అయితే ఓకే..!” ఒకప్పుడు ప్రచారానికి పిలిస్తే వెంటనే వచ్చే జనాలు.. ఇప్పుడు మాత్రం సమయం, రోజు నిర్ణయిస్తూ గడువు పెడుతున్నారు. “ఈరోజు కుదరదు.. రేపు అయితే వస్తాం” అంటూ అభ్యర్థులకు షరతులు పెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో అభ్యర్థులు జనాల టైమ్‌కు అనుగుణంగా ప్రచార షెడ్యూల్ మార్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రచారానికి రావడానికి గడువు పెడుతున్న జనాలు ఎన్ని రోజులు, ఎంతసేపు, ఎవరి ప్రచారానికి వెళ్లాలన్నది కూడా జనాలే నిర్ణయిస్తున్న పరిస్థితి నెలకొంది. ఒకే వార్డులో అన్ని పార్టీల అభ్యర్థుల ప్రచారాల్లో అవే ముఖాలు తిరుగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఉదయం ఒక పార్టీ, సాయంత్రం మరో పార్టీ ప్రచారంలో పాల్గొంటూ జనాలు కనిపిస్తున్నారు. ఒక్క పూట ప్రచారానికి రూ.200 నుంచి రూ.500 ప్రచారం చేయాలంటే జనాలు తప్పనిసరి. ఒక్క పూట ప్రచారానికి 200 నుంచి 500 మంది వరకు జనాలను సమీకరించాల్సి వస్తోంది. అందుకు తగ్గట్టుగా భోజన ఏర్పాట్లు చేయడం అభ్యర్థులకు అనివార్యంగా మారింది. మగవారికైతే లిక్కర్ కూడా ప్రచారంలో ఒక భాగంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రచారం కంటే ఖర్చే ఎక్కువగా మారుతోందని అభ్యర్థులే అనధికారికంగా చెబుతున్నారు. ప్రచారానికి వార్డు వారికి ప్రాధాన్యత ఈ పరిస్థితుల్లో అభ్యర్థులు తమ వార్డుకు చెందిన వారినే ప్రచారంలో ముందు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. స్థానికంగా తెలిసిన ముఖాలుంటే కనీసం ఓటు పనికొస్తుందన్న అంచనాతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. బయటివాళ్ల కంటే వార్డు వాళ్లతో ప్రచారం చేస్తే ఫలితం ఉంటుందన్న లెక్కలు వేస్తున్నారు. ముఖ్య నాయకులు వచ్చినప్పుడు ఇబ్బంది పార్టీ ముఖ్య నాయకులు ప్రచారానికి వస్తున్నారంటే అభ్యర్థులకు మరింత ఒత్తిడి పెరుగుతోంది. సరైన స్థాయిలో జన సమీకరణ చేయకపోతే పార్టీ నాయకుల ముందు పరువు పోతుందన్న భయం వెంటాడుతోంది. దీంతో నాయకుల సభలంటే అభ్యర్థులు ముందే టెన్షన్ పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. “మీరు ఎవరు పిలిచినా ప్రచారానికి వెళ్లండి.. ఓటు మాత్రం మాకే” జన సమీకరణ కష్టంగా మారడంతో అభ్యర్థులు ప్రచారానికి వచ్చిన వారితో సంధి కుదుర్చుకుంటున్నారు. “మీరు ఎవరు పిలిచినా ప్రచారానికి వెళ్లండి.. ఓటు మాత్రం మాకే వేయాలి” అంటూ మాటల ఒప్పందాలు జరుగుతున్నాయన్న చర్చ బహిరంగంగా వినిపిస్తోంది. ప్రచారానికి ఇచ్చే కూలి రూపంలో డబ్బులు ఎన్నికల రోజు పనిచేస్తాయని అభ్యర్థులు భావిస్తున్నారు. జన సమీకరణే అసలైన సవాల్ మొత్తానికి పెద్దపల్లి మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులకు ప్రచారం చేయడం కంటే జనాలను కూడబెట్టడమే అసలైన సవాల్‌గా మారింది. డబ్బు, భోజనం, మద్యం చుట్టూనే ప్రచారం తిరుగుతోందన్న విమర్శలు రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ఈ పరిస్థితి మరింత తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి
.
Aksharam Telugu Daily