D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/స్టాఫ్ రిపోర్టర్ నవంబర్ 18 (అక్షరంన్యూస్) ఖమ్మం రూరల్ : గూడూరుపాడు గ్రామ అభివృద్ధి కోసం ప్రజా ప్రభుత్వం గత రెండేళ్లలో ₹8 కోట్లు 50 లక్షలు విడుదల చేసిందని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం రూరల్ మండలం గూడూరుపాడులో పలు అభివృద్ధి పనులకు ఆయన సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి మాట్లాడుతూ గూడూరుపాడు–ఆకేరు మార్గానికి ₹1.10 కోట్లు, ఎం.వి.పాలెం–గూడూరుపాడు రహదారి నుండి చెరువు అలుగు వరకు ₹3.30 కోట్లు, గూడూరుపాడు–గొర్లపాడు రహదారికి ₹2.97 కోట్లు మంజూరు చేసి బీటీ రోడ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి ₹35 లక్షలు, ఆరోగ్య ఉపకేంద్రం భవనానికి ₹21 లక్షలు, త్రాగునీటి సదుపాయాలకు ₹7 లక్షలు కేటాయించామని చెప్పారు. “ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గూడూరుపాడు గ్రామ అభివృద్ధి ఏ కోణంలోనూ వెనుకబడకుండా చర్యలు తీసుకున్నాం. గ్రామాభివృద్ధి కోసం మొత్తం ₹8.50 కోట్లు విడుదలయ్యాయి. స్థానికుల డిమాండ్ మేరకు కోల్డ్ స్టోరేజ్ రహదారిని కూడా ఆమోదం తెలుపుతున్నాం” అని మంత్రి పేర్కొన్నారు. “పేదలకు ఇండ్లు ఇవ్వాలన్న ఆలోచన గత పాలకులకు లేదు. అయితే ఇందిరమ్మ ప్రభుత్వం తొలి విడతలోనే 4.5 లక్షల ఇళ్లు మంజూరు చేసింది. గూడూరుపాడులో ఇప్పటికే 17 ఇందిరమ్మ ఇండ్లు ఆమోదం పొందాయి. రాబోయే మూడు విడతల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇండ్లను తప్పక అందిస్తాం” అని అన్నారు. “రైతు భరోసా కార్యక్రమం ద్వారా కేవలం 9 రోజుల్లో 9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాం. సన్న వరి ధాన్యానికి మద్దతు ధరతో పాటు ₹500 బోనస్ అందిస్తున్నాం. రైతును రాజు చేయడం మా ప్రభుత్వ లక్ష్యం” అని తెలిపారు. గురుకులాల్లో 40% డైట్ చార్జీలు, 200% కాస్మొటిక్స్ చార్జీల పెంపు చేపట్టామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీ, రాష్ట్రవ్యాప్తంగా 16 లక్షల రేషన్ కార్డుల విడుదల జరిగిందని గుర్తుచేశారు. “పేదలకు ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. సంక్షేమం–అభివృద్ధి అనే రెండు రెక్కలతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదాలు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా” అని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్‌రెడ్డి, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, ఆర్డీఓ నరసింహారావు, ఆర్‌అండ్‌బి ఎస్ఈ యాకోబు, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily