Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం : 17వ లోక్ సభ సమయంలో జెడ్ఆర్ యుసిసి సభ్యునిగా, నాడు ఖమ్మం లోక్ సభ సభ్యునిగా నామ నాగేశ్వర రావు రైల్వే సమస్యలు పరిష్కారం కొరకు చేసిన విశేషమైన కృషిని కొనియాడుతూ దక్షిణ మధ్య రైల్వే, జనరల్ మేనేజర్ కార్యాలయం, సికింద్రాబాద్ నుండి సంబంధిత శాఖ డిప్యూటీ జనరల్ మేనేజర్, జెడ్ఆర్ యుసిసి ఎక్స్-అఫీషియో సెక్రటరీ నుండి రాసిన లేఖ బుధవారం ఖమ్మం, మాజీ ఎంపీ నామ కార్యాలయానికి అందింది. రైల్వే బోర్డు సూచనల ప్రకారం, ప్రస్తుత జెడ్ఆర్ యుసిసి పదవీ కాలం 30.09.2024 నుండి రద్దు చేయబడిందని తెలియజేయటంతో పాటు దక్షిణ మధ్య రైల్వే జోనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ (జెడ్ ఆర్ యు సి సి) సభ్యునిగా నామ ఇచ్చిన అమూల్యమైన సహకారం, మద్దతుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నారు. నామ అనుభవాలు మరియు సూచనల వల్ల దక్షిణ మధ్య రైల్వే సేవలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించిందన్నారు. నామ అంకితభావానికి, సహకారానికి మరోసారి కృతజ్ఞతలు తెలుపుతూ భవిష్యత్తులో మళ్లీ కలుసుకునే అవకాశం ఆశిస్తున్నాము అని నామ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. జెడ్ ఆర్ యు సి సి సభ్యునిగా నామ సేవలు అనిర్వచనీయం: రాష్ట్ర విభజన హామీలలో భాగంగా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కొరకు పార్లమెంట్ లోన బయట మాట్లాడటంతో పాటు జెడ్ఆర్ యుసిసి సమావేశాల్లో కూడా నామ పట్టుబట్టారు. తాను వందకు పైగా లేఖలు రాయడం తో పాటుగా ఎంతో శ్రమించి సాధించిన భద్రాచలం - కొవ్వూ రు రైల్వే లైన్ కు సంబంధించి కొత్తగూడెం నుండి సత్తుపల్లి పూర్తి అయ్యింది, అలాగే సత్తుపల్లి నుండి కొవ్వూరు వరకు రైల్వే లైన్ కు నిధులు మంజూరు చేసి పూర్తి చేయలని, భద్రాద్రి కొత్తగూడెం పాండురంగాపురం నుండి సారపాక రైల్వే లైన్ తో పాటు రాష్ట్రం లో పలు పెండింగ్ రైల్వే లైన్ల సాధన కొరకు నామ పోరాడినారు. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం లో ప్రధానంగా రైల్వే స్టేషన్‌ల ఆధునీకరణ, అప్‌గ్రేడేషన్ కు అభివృద్ధిలో భాగంగా ఖమ్మం రైల్వే స్టేషన్లలో సీసీ టీవీలు, ఎస్కలేటర్లు, లిఫ్టులు, నూతన ప్లాట్‌ఫారమ్‌లు ఏర్పాటు, రక్షిత మంచి నీటి వాటర్ ప్లాంట్లు, మంచి వెయిటింగ్ హాల్స్, టాయిలెట్లు, ఫుడ్ వెండింగ్ స్టాల్స్, మహిళలకు ప్రత్యేక సౌకర్యాలు వంటి ప్రాథమిక సౌకర్యాలు రైల్వే స్టేషన్లలో కల్పించాలన్నారు. డోర్నకల్ - మిర్యాలగూడ రైల్వే లైన్ అలైన్మెంట్ పున:పరిశీలన చేయించి రైల్వే లైన్ మార్పు విషయంలో నామ పట్టుబట్టి ప్రజల అభిమతమే తన అభిమతమని, వారికి నష్టం కలిగే దేనిని సహించనని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలైన్మెంట్ మార్చాల్సిందేనని నామ నాడు పట్టుబట్టారు. అప్పటికే జాతీయ రహదారులు, నాగార్జున సాగర్, ఇతర వాటి వల్ల రైతులు తమ విలువైన భూములను కోల్పోయి, నష్టపోయారని, మళ్లీ ఉన్న కాస్త భూములను కోల్పోవడానికి సిద్దంగా లేరని రైతుల పక్షాన నామ గళం వినిపించారు. దేశ వ్యాప్తంగా వివిధ పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో పని చేస్తున్న జర్నలిస్టులకు సంబంధించి నిలుపుదల చేసిన రైల్వే పాసులను సత్వరమే పునరుద్దరించి, తగిన చర్యలు తీసుకోవాలని పార్లమెంట్ సాక్షిగా కోరారు. నాడు రైల్వే సమస్యల పైన నాడు పార్లమెంట్ లో మాట్లాడడంతో పాటు, రైల్వే మంత్రులను, రైల్వే బోర్డు చైర్మన్ ను కలిసి, మాట్లాడి, లేఖలు అందించిన ఫలితంగా పెద్ద ఎత్తున ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం రైల్వే స్టేషన్ల అభివృద్ధి, కొత్త రైల్వే మార్గాలు, ఆర్వోబీ, ఆర్.యు.బి, అండర్ పాస్ ల నిర్మాణం జరిగింది. అందులో భాగంగానే ముత్యాలగూడెం, దెందుకూరు, మీనవోలు అండర్ పాస్ , కొత్తగూడెం రోడ్ ఓవర్ బ్రిడ్జి, డోర్నకల్ పాపటపల్లి రోడ్ అండర్ పాస్, మధిర- మోటమర్రి, మధిర-తొండలగోపవరం రోడ్ అండర్ పాస్ ల మంజూరు అయినవి. జిల్లాలో అమృత్ భారత్ పధకం ఒకొక్క రైల్వే స్టేషన్ కు రూ. 25.5 కోట్లు చొప్పున ఖమ్మం, మధిర, కొత్తగూడెం మూడు రైల్వే స్టేషన్స్ అభివృద్ధికి రూ. 76.5 కోట్లు మంజూరుకు కృషి చేశారు. ఎర్రుపాలెం , మోటమర్రి, బోనకల్, చింతకాని, కారేపల్లి, చీమలపాడు, గాంధీనగర్ రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేసి, కనీస మోలిక సదుపాయాలు కల్పనకు చొరవచూపారు. మధిర, ఖమ్మం నియోజకవర్గాల్లోని రైల్వే స్టేషన్ల నందు పలు రైళ్ల హాల్టింగ్ కోసం కృషి చేసినారు. బొగ్గు రవాణాకే పరితమైన సత్తుపల్లి రైల్వే స్టేషన్ ను ఆధునిక సౌకర్యాలతో బహుళార్థ సాధకంగా తీర్చిదిద్దటంతో పాటు ప్రజల రవాణా అవసరాలు దృష్టిలో ఉంచుకొని సింగరేణి రైల్వే లైన్ కు సంబంధించి చండ్రుగొండ, సత్తుపల్లి కొత్త రైల్వే స్టేషన్ల అభివృద్ధి కి నిధులు మంజూరు చేయాలన్నారు. కోవిడ్ సమయంలో రద్దు చేసిన రైళ్లను తిరిగి పునరుద్ధరించాలని పలు మార్లు ప్రస్తావించటం తో పాటు అనేక రైల్వే సమస్యల పైన నాడు జెడ్ఆర్ యుసిసి సమావేశాల్లో నామ తన గళం వినిపించారు.
-
Aksharam Telugu Daily