Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో పారిశుద్ధ్యం లోపించి ప్రజలు రోగాల భారినపడే పరిస్థితులు నెలకొనడంతో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక ద్రుష్టి సారించాలని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు మున్సిపల్, పంచాయతిరాజ్ శాఖల అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణపై అలసత్వం వహిస్తే సహించేదిలేదని, అవసరమైతే పారిశుద్ధ్య సిబ్బంది సంఖ్యను పెంచి పనులు చేపట్టాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిత్యం అందుబాటులో ఉండాలని, విషజ్వరాలు ప్రభలే ప్రాంతాలు, గ్రామాలు గుర్తించి తక్షణమే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం ద్వారా పరిస్థితిని అదుపులోకి తేవాలన్నారు. మున్సిపల్, పంచాయతి రాజ్ శాఖలతోపాటు వైద్య ఆరోగ్య శాఖా అధికారులు, సిబ్బంది ప్రజా క్షేత్రాల్లో వుండి సేవలు అందించాలన్నారు. వర్షాలు, వరదల కారణంగా నిర్వాసితులుగా మారె పేదలకు యుద్ధప్రాతిపదికన పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఆదుకోవాలని, అందుకోసం ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా ఉపేక్షించేదిలేదన్నారు.
-
Aksharam Telugu Daily