Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ : మహబూబాబాద్ /బయ్యారం/సెప్టెంబర్ 4/అక్షరం న్యూస్... జలదిగ్బంధంలో ఉన్న బయ్యారం చెరువు లోతట్టు గ్రామాలైన కాచనపల్లి, కిష్టాపురం, మొట్లగూడెం, మూల పోచారం, రామన్నగూడెం కొత్తగూడెం, లింగగిరి, చుంచు బంధం, కోయగూడెం, సుద్దరేవు, కంబాలపల్లి తదితల గ్రామాల రైతుల పంట పొలాలన్నీ గత ఆరు రోజులుగా నీట మునిగి ఉన్నాయని, పంట నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య కోరారు.మహబూబాబాద్ జిల్లా, బయ్యారం మండలాల పరిధిలోని మూలపోచారం, కాచనపల్లి, మొట్లగూడెం, కిష్టాపురం గ్రామాలలో నీట మునిగిన పంట పొలాలను పార్టీ కార్యకర్తలతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గౌని ఐలయ్య మాట్లాడుతూ, బయ్యారం మండలంలో వేలాది ఎకరాల పంట భూములు నీట మునిగి ధ్వంసం అయ్యాయని, పందిపంపుల వాగు, ఉమ్మలేరు, అలిగేరు, పాకాల ఏరు పరిసర పంటచేలు కోతకు గురై వందల ఎకరాల్లో ఇసుక మేటలు వేశాయని అన్నారు.ముఖ్యమంత్రి ఎకరానికి పదివేలు పంటనష్టం ప్రకటించారని, ఇప్పటికే ఎకరానికి 20వేలకు పైగా పెట్టుబడి పెట్టిన వరి రైతులకు ఇది ఏమాత్రం సరిపోదని, ఎకరానికి 25 వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో తిరిగి సమగ్ర పంట నష్ట వివరాలను నమోదు చేయాలని,పంట నష్టం జరిగిన వారందరికీ పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. గత వారం రోజులుగా వర్షాలు వరదలతో ప్రజలు సతమతమవుతున్నా ఇంతవరకు అధికారులు ఎవరు గ్రామాలకు రాలేదని, పంట నష్టం వివరాలను సేకరించలేదని ఆయన అన్నారు.పంట నష్టం అంచనాను పారదర్శకంగా నమోదు చేయాలని నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందకపోతే ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. పంట నష్టాన్ని పరిశీలించిన బృందంలో ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి మాదం శెట్టి నాగేశ్వరరావు, పార్టీ మండల నాయకులు కొదుమూరి నాగేశ్వరరావు, బొమ్మల చిట్టిబాబు లతోపాటు స్థానిక కార్యకర్తలు అలెం వెంకటేశ్వర్లు, చాట్ల రాజు, బొమ్మెల నారాయణ, బచ్చల ఎర్రయ్య, తాటి రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily