Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ తల్లాడ ఆగస్టు 25 (అక్షరంన్యూస్) ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి ఉద్యమంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రాష్ట్రం కోసం కొట్లాడిన ఉద్యమకారులకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో భర్తీ చేయనున్న నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం కల్పించాలని టిపిసిసి అధికార ప్రతినిధి, ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ నేత డాక్టర్ గంగదేవుల లోకేష్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఓయూ ఆర్ట్స్ కాలేజీ సెమినార్ హాల్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కారులను ప్రభుత్వం గుర్తించాలని కోరారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కోసం విద్యార్థులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అనేక పోరాటాలు ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. విద్యార్థులు సకల జనుల సమ్మె చేయటం ద్వారానే ఆనాడు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిందని తెలిపారు. ప్రస్తుత అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించి నామినేట్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఇప్పటికే నామినేటెడ్ పదవుల కోసం అనేకమంది ఉద్యమకారులు వేచి చూస్తున్నారని వారిని గుర్తించి అవకాశాలు కల్పించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
.
Aksharam Telugu Daily