Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం దృష్ట్యా జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయని ఈ నేపథ్యంలో ప్రజలు,అధికార యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో మణుగూరులో వరద ముంపుకు గురైన ప్రాంతాలను ఆయన జిల్లా ఎస్పీ రోహిత్ రాజుతో కలిసి ఆదివారం ఉదయం పరిశీలించారు. అనేక లోతట్టు ప్రాంతాల్లో మోకాల్లోతు భారీ వరద నీటిలో నడిచి మరీ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఊహించిన దానికంటే భారీ వర్షపాతం నమోదయిందని దానివల్ల లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద పోటెత్తిందని అన్నారు. శనివారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి మణుగూరు పట్టణంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయని,ముంపు ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు చేపట్టారని చెప్పారు. గర్భిణీ స్త్రీలకు ఇబ్బందులు కలగకుండా వారిని ముందే సురక్షిత ప్రాంతాలకు తరలించామని, అదే విధంగా 130 మంది చిన్నారులను ఆశ్రమ పాఠశాలలోని పునరావాస కేంద్రంలో ఉంచామని చెప్పారు. వీరందరికీ ఆహారంతో పాటు ఇతర తినుబండారాలను అందిస్తున్నామని తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే తప్ప ముంపు ప్రాంతాల్లో ఉండే వారు బయటకు రావద్దని సూచించారు. చెరువులు, వాగులు పొంగుతున్నాయని వ్యక్తులు ఎవరు కూడా సాహసించి రహదారులపై ప్రవహించే వరద ప్రవాహాన్ని దాటే ప్రయత్నం చేయొద్దు అన్నారు. వరదలు తగ్గిన తర్వాత అంటువ్యాధులు ప్రభులే అవకాశం ఉన్నందున గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ సిబ్బంది పారిశుద్ధ కార్యక్రమాలను వెంటనే చేపట్టాలని సూచించారు. కాచి వడపోసిన నీటిని మాత్రమే ప్రజలు తాగాలని, నిల్వ ఉన్న ఆహార పదార్థాలను తినకుండా వేడి పదార్థాలను మాత్రమే స్వీకరించాలని చెప్పారు. సింగరేణి, డిఆర్డిఏ,మున్సిపల్, రెవిన్యూ,ఇర్రిగేషన్ అధికారులతో మాట్లాడి మణుగూరులో వరద సమస్యకు గల కారణాలను నివారించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు. కలెక్టర్ వెంట మణుగూరు డిఎస్పి, తహసిల్దార్ ,స్థానిక అధికారులు ఉన్నారు..
-
Aksharam Telugu Daily